సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలలో తెరాస అనుబంద సంస్థ టిబిజికెఎస్ ఘనవిజయం సాధించడంతో సింగరేణి కార్మికులకు కృతజ్ఞతలు చెప్పుకొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ప్రగతి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు.
సింగరేణి ఎన్నికలలో ప్రతిపక్షాలు మా ప్రభుత్వంపై ఎంతగా దుష్ప్రచారం చేసినా సింగరేణి కార్మికులు వాటిని నమ్మకుండా నాపైన, నా ప్రభుత్వంపైన ఎంతో నమ్మకం ఉంచి టిబిజికెఎస్ ను గెలిపించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. వారికి ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చే బాధ్యత నాదే. అన్ని హామీలను తప్పకుండా అమలుచేసి చూపిస్తాను. తెలంగాణాలో తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయం అని గొప్పలు చెప్పుకొన్న భాజపాకు ఈ ఎన్నికలలో వచ్చిన ఓట్లు కేవలం 246 మాత్రమే. అటువంటి పార్టీ ఎన్నటికైనా మాకు ప్రత్యామ్నాయం కాగలదా? తెలంగాణా ఏర్పడినప్పటి నుంచి సింగరేణి ఎన్నికలతో సహా ఇప్పటి వరకు జరిగిన ప్రతీ ఎన్నికలలో ప్రజలు ప్రతిపక్షాలకు గట్టిగా గడ్డి పెడుతూనే ఉన్నారు. అయినా వారి తీరుమారడం లేదు. ఇకనైనా వారు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ప్రజలలో గౌరవం మిగులుతుంది,” అని కేసీఆర్ అన్నారు.