సింగరేణి సోదరులారా..కృతజ్ఞతలు: కవిత

సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలలో కార్మికులు అందరూ తనపై, తన ప్రభుత్వంపై నమ్మకముంచి  టిబిజికెఎస్ కు ఓట్లు వేసి ఘనవిజయం అందించినందుకు టిబిజికెఎస్ గౌరవ అధ్యక్షురాలు, తెరాస ఎంపి కవిత సింగరేణి కార్మికులు అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అన్ని హామీలను తపకుండా నెరవేర్చి ప్రభుత్వంపై వారి నమ్మకాన్ని నిలబెట్టుకొంటానని కవిత చెప్పారు. ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా తన దృష్టికి వచ్చిన సింగరేణి కార్మికుల సమస్యలన్నిటినీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళి వీలైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తానని కవిత హామీ ఇచ్చారు. ఇక నుంచి సింగరేణి కార్మికుల కోసం మరింత సమయం కేటాయించి వారి సమస్యల పరిష్కారానికి గట్టిగా ప్రయత్నిస్తానని కవిత చెప్పారు.

తెరాస ఎంపి బాల్క సుమన్ మాట్లాడుతూ, ప్రొఫెసర్ కోదండరామ్ చేసిన దుష్ప్రచారాన్ని సింగరేణి కార్మికులు ఎవరూ నమ్మలేదని స్పష్టం అయ్యిందని, కనుక ఇప్పటికైనా ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. టిబిజికెఎస్ ను ఓడించేందుకు ప్రతిపక్షాలు అన్నీ చేతులు కలిపినా ఘోరంగా ఓడిపోయాయని, ఈ ఫలితాలు వాటి వాస్తవ బలం ఏపాటిదో నిరూపించాయని అన్నారు. సింగరేణికి ముఖ్యమంత్రి కేసీఆరే శ్రీరామరక్షగా నిలుస్తారని సుమన్ అన్నారు.