సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలలో తెరాస అనుబంధ సంఘం టిబిజికెఎస్ ఘన విజయం సాధించడంతో తెరాస విజయోత్సాహంతో పొంగిపోతోంది. అది సహజమే. ఈ గెలుపుకు ప్రధాన సూత్రధారి టిబిజికెఎస్ గౌరవాధ్యక్షురాలు, తెరాస ఎంపి కవితేనని అందరికీ తెలుసు. వారసత్వ ఉద్యోగాల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలతో టిబిజికెఎస్ డీలాపడిపోయినప్పుడు కవిత ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం టిబిజికెఎస్ కు అనుకూలంగా మారిపోయింది. ఆమె వాగ్ధాటికి, వ్యూహాలకు ప్రతిపక్షాలు చిత్తుచిత్తయిపోయాయి. పైగా ఆమె తండ్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటంతో ఎన్నికలకు ముందు ఆయన చేత అనేక హామీలు, వరాలు, కార్మికులు ఊహించలేనంత బోనసులు ప్రకటింపజేస్తున్నప్పుడే టిబిజికెఎస్ విజయం దాదాపు నిశ్చయం అయిపోయింది. ఊహించినట్లుగానీ 11 డివిజన్లలో 9 డివిజన్లలో టిబిజికెఎస్ విజయపథకం ఎగురవేసింది.
ఈ ఘనవిజయానికి కారకురాలైన తన సోదరి కవితను అభినందిస్తూ మంత్రి కేటిఆర్ ట్వీట్ చేశారు. “ప్రతిపక్షాలన్నీ కలిసి అనైతికంగా కూటమి కట్టినప్పటికీ టిబిజికెఎస్ గెలుపును అడ్డుకోలేకపోయాయని, ఈ విజయం సాధించినందుకు అభినందనలు” అని కేటిఆర్ ట్వీట్ చేశారు.