వచ్చే ఏడాది కొన్ని రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు జరుగబోతున్నందున, లోక్ సభ ఎన్నికలను కూడా వాటితో కలిపి నిర్వహించాలనుకొంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ఇదివరకే చెప్పారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాలతో సహా మరికొన్ని రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలకు అప్పటికి ఇంకా ఆరేడు నెలల సమయం మిగిలి ఉంటుంది కనుక ఆ రాష్ట్రాలు కూడా అంగీకరిస్తే అన్నిటినీ కలిపి ఒకేసారి 2018 సెప్టెంబర్ లేదా నవంబర్ లోగా ఎన్నికలు నిర్వహించాలని మోడీ సర్కార్ ఆలోచిస్తోంది. అవి ఆలోచనలకే పరిమితం కాలేదని, మోడీ సర్కార్ నిజంగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దం అవుతోందని సూచిస్తున్నట్లుంది కేంద్ర ఎన్నికల కమీషనర్ ఓపి రావత్ ఈరోజు చేసిన ప్రకటన.
ఆయన డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “లోక్ సభ, శాసనసభ ఎన్నికలను కలిపి నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవలసిందిగా కేంద్రప్రభుత్వం మమ్మల్ని కోరింది. అందుకోసం కొత్త ఈవిఎం మెషిన్లు, వివిపిఎటి మెషిన్లు కొనుగోలు చేయడానికి కేంద్రప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆ మెషిన్ల కోసం ఆర్డర్ ఇచ్చేశాము. సెప్టెంబర్ 2018నాటికల్లా మేము వాటితో ఎన్నికలు నిర్వహించడానికి సిద్దం. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలనేది కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకొని మాకు తెలియజేస్తే అందుకు అనుగుణంగా షెడ్యూల్ రూపొందించుకొని ఎన్నికలు నిర్వహించగలము,” అని ఓపి రావత్ తెలిపారు. కనుక సార్వత్రిక ఎన్నికలు ఈసారి ఆరు నెలలు ముందుగానే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.