సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలు నేడు జరుగబోతున్నాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికలలో మొత్తం 52,534 మంది కార్మికులు, ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు. ఈ ఎన్నికల కోసం సింగరేణి 11 ఏరియాలలో 92 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసిన తరువాత సాయంత్రం 7గంటల నుంచి ఏరియాల వారీగా ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలవుతుంది. కనుక రాత్రి 10-12 గంటల లోగానే ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
ఓటింగ్ లో పాల్గొనే కార్మికులు, ఉద్యోగులు తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డు తెచ్చుకోవలసి ఉంటుందని రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న డిప్యూటి చీఫ్ రీజినల్ లేబర్ కమిషనర్ డా. కె.కె.హెచ్.ఎం. హెచ్.ఎం శ్యాంసుందర్ తెలిపారు. ఏ కారణం చేతైన గుర్తింపు కార్డు లేనివారు, తమ పాస్ పోర్ట్ సైజ్ ఫోటోను తెచ్చుకొన్నట్లయితే తాత్కాలికంగా వారికి గుర్తింపు పత్రం ఏర్పాటు చేసి ఓటింగ్ లో పాల్గొనేందుకు అనుమతిస్తామని తెలిపారు. ఇప్పటికే సింగరేణి కార్మికులు, ఉద్యోగులందరికీ ఓటరు గుర్తింపు స్లిప్స్ మరియు వారి పోలింగ్ బూత్ వివరాలను అందజేశామని తెలిపారు.
సింగరేణి పోలింగ్ కోసం ఆరు జిల్లాలకు చెందిన రెవెన్యూ మరియు ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పోలింగ్ మరియు కౌంటింగ్ కోసం నియమించబడ్డారు. ఎన్నడూ కనీవినీ ఎరుగని తీవ్రస్థాయిలో ఈ ఎన్నికలు జరుగుతున్నందున పోలింగ్ జరిగే అన్ని ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
సింగరేణి 11 ఏరియాలలో రాంపూర్ మరియు రామగుండం ఏరియాలలోనే అత్యధికంగా ఓటర్లు ఉన్నందున అక్కడి ఓట్లు ఫలితాలను నిర్దేశించబోతున్నాయి.