ఆ మద్యన ఖమ్మంలో రైతన్నలకు బేడీలు వేసి కోర్టుకు తీసుకువచ్చి అవమానించిన ఘటన ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. అంతకు ముందు తమిళనాడు రైతన్నలు తమను రుణవిముక్తులను చేయమని కోరుతూ డిల్లీ వీధులలో సుమారు రెండున్నర నెలలు రకరకాలుగా నిరసనలు తెలియజేసినా వారిని మోడీ సర్కార్ పట్టించుకోలేదు. ఇప్పుడు మధ్యప్రదేశ్ రైతన్నలకు అంతకంటే ఘోర అవమానం జరిగింది. ఆ రాష్ట్రంలో బుందేల్ ఖండ్ ఎప్పుడూ తీవ్ర కరువుకాటకాలతో అల్లాడుతుంటుంది. తమను ఆదుకోమని అక్కడి రైతులు ప్రభుత్వానికి ఎంతగా మొరపెట్టుకొన్నా పట్టించుకోకపోవడంతో వారు బుందేల్ ఖండ్ జిల్లా కేంద్రంలో నిరసనలు చేపట్టారు. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్ కు తీసుకువెళ్ళి అందరి చేత బట్టలు విప్పించి కూర్చోబెట్టారు.
ఈ ఘటనపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మానవహక్కుల సంఘానికి పిర్యాదు చేయగా ఆ రాష్ట్ర హోం మంత్రి భూపేంద్ర సింగ్, జరిగిన దానికి ఏమాత్రం పశ్చాతాపం వ్యక్తం చేయకపోగా కాంగ్రెస్ నేతలే రైతులను రెచ్చగొట్టి ధర్నాలు చేయించారని నిందించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలుసుకొన్నాక భాద్యులపై చర్యలు తీసుకొంటానని ముక్తాయించారు. ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డు కార్యాలయంపై మిర్చి రైతులు దాడి చేసినప్పుడు కూడా తెరాస సర్కార్ ఈవిధంగానే స్పందించిన సంగతి బహుశః అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. రైతుల కోసమే తమ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఒకపక్క చెప్పుకొంటూనే మరోపక్క అన్నదాతలతో ఈవిధంగా అనుచితంగా వ్యవహరిస్తుండటం చాలా బాధాకరం. ఇఉవన్తి సంఘటనలు చూస్తూనప్పుడు దేశమంతా అన్నదాతల పరిస్థితి ఒకేలా ఉందనిపిస్తుంది.