డేరాబాబా గుర్మీత్ రాం రహీం సింగ్ అరెస్ట్ అయిన తరువాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన అయన పెంపుడు కుమార్తె హనీ ప్రీత్ సింగ్ ను హర్యానా పోలీసులు మంగళవారం పాటియాలా సమీపంలో పట్టుకొని అరెస్ట్ చేశారు. గుర్మీత్ ను పంచకుల కోర్టు దోషిగా నిర్ధారించి 20 ఏళ్ళు జైలు శిక్ష విధించినప్పుడు అతనిని పోలీసుల చెర నుంచి విడిపించుకొని పోయేందుకు సిర్సా, పాటియాలా తదితర ప్రాంతాలలో అల్లర్లు సృష్టించారు. ఆ అల్లర్లలో 41 మంది మరణించారు. వందలకోట్ల విలువగల ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ద్వంసం అయ్యాయి. డేరాబాబాను విడిపించుకోనేందుకే హనీప్రీత్ సింగ్ ఆ అల్లర్లను ప్రోత్సహించిందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఆమెను ఈరోజు పాటియాలా కోర్టులో హాజరుపరిచి, న్యాయమూర్తి అనుమతితో ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తామని పంచకుల పోలీస్ కమీషనర్ ఎఎస్ చావ్లా మీడియాకు తెలిపారు.
అయితే ఆమె వారి ఆరోపణలను ఖండించింది. తనకు, గుర్మీత్ కు మద్య తండ్రీకూతుళ్ళ సంబంధం మాత్రమే ఉందని, కానీ మీడియా తమకు అక్రమసంబంధం అంటగట్టడం చూసి తను చాలా కుమిలిపోయానని చెప్పింది. తను, తన తండ్రి ఎన్నడూ చీమను కూడా చంపలేదని, అటువంటిది తాము హత్యలు చేశామని చెప్పడం చాలా బాధ కలిగిస్తోందని చెప్పింది. దేశభక్తిని ప్రభోదిస్తూ తాము ఎన్నో సినిమాలు తీశామని అటువంటి తమపై దేశద్రోహం నేరం మోపడం చాలా బాధకలిగించిందని హనీప్రీత్ సింగ్ చెప్పింది. ఈ కేసులపై హైకోర్టులో అప్పీలు చేసుకొంటామని తెలిపింది.
ఆమె తమను తాము సమర్ధించుకొంటూ ఎన్ని మాటలు చెప్పినప్పటికీ డేరా ఆశ్రమంలో గుట్టలు కొద్దీ దొరికిన ఆధునిక మారణాయుధాలు, ప్రేలుడు సామాగ్రి, అస్తిపంజరాలు, నిషేధిత నోట్ల కట్టలు, రహస్య సొరంగ మార్గాలు, విలాసవంతమైన పడక గదులు, ప్రత్యక్ష సాక్షులు చెపుతున్న మాటలు అన్నీ పోలీసుల ఆరోపణలను బలపరిచేవిగానే ఉన్నాయనే సంగతి అందరికీ తెలుసు.
ప్రస్తుతం రోహతక్ జైల్లో ఉన్న గుర్మీత్ రాం రహీం సింగ్ ఆమె కోసం చాలా పరితపించిపోతున్నాడు కనుక ఆమెను కూడా న్యాయస్థానం దోషిగా నిర్ధారించి శిక్ష విధించినట్లయితే మళ్ళీ ఇద్దరూ జైల్లో హాయిగా రోజులు వెళ్ళదీసేయవచ్చు.