ఈసారి అమెరికాకు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మకమైన నోబుల్ బహుమతి లభించడం విశేషం. వారు ముగ్గురూ గురుత్వాకర్షణ తరంగాలపై చేసిన పరిశోధనలకు గాను భౌతికశాస్త్రంలో 2017వ సంవత్సరానికి ఈ నోబుల్ పురస్కారానికి ఎంపికయ్యారు. ముగ్గురూ వయో వృద్ధులే కావడం మరో విశేషం.
వారిలో బ్యారీ సి బ్యారీష్ కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆచార్యులుగా చేస్తున్నారు. ఆయన వయసు 81సం.లు. ఈ అవార్డు అందుకొన్న రెండవ వ్యక్తి పేరు రైనర్ వేస్. వయసు 85 ఏళ్ళు. ఆయన మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆచార్యుడుగా చేస్తున్నారు. అయన జన్మతః జర్మన్ దేశస్థుడు కానీ అమెరికాలోనే స్థిరపడ్డారు. ఇక మూడవ వ్యక్తి కిప్ దోర్న్. అయన కూడా కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోనే దియోరేతికల్ ఫిజిక్స్ విభాగంలో ఆచార్యులుగా చేస్తున్నారు. అయన వయసు 77 ఏళ్ళు.
భారత్ లో చాలా మంది 50-55 ఏళ్ళు నిండగానే ఇక తమ వయసు అయిపోయింది...ఇక ఏమీ చేయలేమన్నట్లు మాట్లాడుతుంటారు. అటువంటివారు ఈ ముగ్గురు వృద్ధ శాస్త్రవేత్తలను ప్రేరణగా తీసుకొన్నట్లయితే, నోబుల్ ప్రైజ్ సాధించకపోయినా మళ్ళీ జీవితం కొత్తగా మొదలుపెట్టవచ్చు.