ప్రముఖ నటుడు, హిందూపురం తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తరచూ తన అభిమానుల చెంప చెళ్ళుమనిపిస్తూనే ఉంటారని నిరూపించే ఘటన మంగళవారం అనంతపురంలో జరిగింది. ఆయన అనంతపురంలో ఇంటింటికీ తెదేపా కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు ఆయనను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఆ సమయంలో ఆయన వెనుక నిలబడి ఉన్న ఒక అభిమాని ముందుకు వచ్చే ప్రయత్నంలో ఆయనను రాసుకొంటూ వెళ్ళాడు. దానితో బాలకృష్ణకు ఆగ్రహం వచ్చేసింది...అంతే వెంటనే ఆ అభిమాని చెంప చెళ్ళుమనిపించేశారు. ఆ సమయంలో మరో అభిమాని తన మొబైల్ ఫోన్ తో బాలకృష్ణను వీడియో తీస్తున్నాడు. దానిలో ఈ ఘటన కూడా రికార్డ్ అయిపోయింది. అతను వెంటనే సోషల్ మీడియాలో దానిని పోస్ట్ చేసేయడంతో అది మీడియాకు కూడా చేరిపోయింది.
ఒక ప్రజా ప్రతినిధిగా..సినిమాలలో ప్రజలను రక్షించే గొప్ప ఉద్దాత్త పురుషుడిగా నటించే బాలకృష్ణ తరచూ ఈవిధంగా అభిమానులపై చెయ్యి చేసుకోవడం సబబుగా లేదు. సామాన్య ప్రజలకు, అభిమానులను భరించడం తన వల్లకాదనుకొంటే వారి మద్యకు వెళ్ళకుండా ఉంటే సరిపోతుంది కదా. కానీ “ప్రజలు..అభిమానులే నాకు దేవుళ్ళు...మీ వల్లనే ఈ స్థాయికి వచ్చాను” అని వేదికల మీద నుంచి చెపుతూ, జనంలోకి రాగానే వారిని కొట్టడం చూస్తుంటే మాటలకు, చేతలకు మద్య చాలా తేడా ఉందని స్పష్టం అవుతోంది. ఇటువంటి దురుసుతనం వలన వ్యక్తిగతంగా ఆయనకు, రాజకీయంగా తెదేపాకు చాలా అప్రదిష్ట కలిగిస్తుందని మరిచిపోకూడదు.
(వీడియో: ఆంధ్రజ్యోతి సౌజన్యంతో)