కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డిగత కొన్నిరోజులుగా తనపై చేస్తున్న వ్యాఖ్యలకు, సవాళ్ళకు ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి ఈరోజు ధీటుగా జవాబిచ్చారు.
“కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మతి భ్రమించినందునే నోటికి వచ్చినట్లు ఏదేదో మాట్లాడుతున్నాడు. నాపై పోటీ చేసి గెలుస్తానని సవాళ్లు విసురుతూ పగటి కలలు కనడంకంటే ముందు పార్టీలో తన పరిస్థితి ఏమిటో తెలుసుకొంటే మంచిది. కాంగ్రెస్ నేతల మద్య చాలా తీవ్రస్థాయిలో ఆధిపత్యపోరు జరుగుతోంది. ఇటువంటి పరిస్థితులలో కూడా వారు వచ్చే ఎన్నికలలో మా తెరాస పార్టీని ఓడించి అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. వచ్చే ఎన్నికలలో గెలవడం సంగతి దేవుడెరుగు. కాంగ్రెస్ నేతలు తన ఉనికిని కాపాడుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే వారు తెలంగాణా రైతు సమన్వయ సమితిల ఏర్పాటును, వాటి కోసం మా ప్రభుత్వం జారీ చేసిన జీవో: 39,40 లను వ్యతిరేకిస్తూ హడావుడి చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు ఎంత హడావుడి చేసినా వచ్చే ఎన్నికలలో వారు అధికారంలోకి రావడం కల్ల. ఈ సంగతి వారు ఎంత త్వరగా గ్రహిస్తే వారికి అంత మంచిది,” అని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.