ముఖ్యమంత్రికి ఇది తగదు: కిషన్ రెడ్డి

సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకోవడాన్ని భాజపా నేత కిషన్ రెడ్డి తప్పు పట్టారు. ఎమ్మెల్సీ రామచందర్ రావుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “గతంలో ఎన్నడూ ఏ  ముఖ్యమంత్రి సింగరేణి కార్మికసంఘాల ఎన్నికలలో జోక్యం చేసుకోలేదు. అది ముఖ్యమంత్రి స్థాయికి తగదు కనుకనే ఎవరూ ఏనాడూ జోక్యం చేసుకోలేదు. కానీ కేసీఆర్ ‘తన పరిపాలన అద్భుతంగా సాగుతోంది..ప్రజలందరూ తమవైపే ఉన్నారని’ ఒకపక్క గొప్పలు చెప్పుకొంటూనే మరోపక్క సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలలో జోక్యం చేసుకొని కార్మికులను ప్రలోభపెట్టి ఆకర్షించడానికి రకరకాల తాయిలాలు అందిస్తున్నారు. పాత హామీలను నెరవేర్చకుండానే మళ్ళీ కొత్త హామీలు ప్రకటిస్తున్నారు. ఈ మూడేళ్ళలో తెరాస సర్కార్ ఎన్ని హామీలు అమలుచేసింది? 

వారసత్వ ఉద్యోగాలు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు కారుణ్య ఉద్యోగాలు అంటూ కొత్తపాట పాడుతోంది. అలాగే కార్మికులు అందరికీ ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తామని చెప్పి ఇప్పుడు సబ్సీడీ మీద ఇళ్ళు ఇస్తామని మాట మార్చింది. కోల్ ఇండియా కార్మికులకు ఉచితంగా ఇళ్ళు ఇస్తున్నప్పుడు సింగరేణి కార్మికులకు అందుకు అర్హులుకారా? కార్మికులకు ఆదాయపన్ను రీఇంబర్స్ మెంట్ చేస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు? కార్మికుల కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తానని చెప్పిన కేసీఆర్ ఇంతవరకు దానిని ఎందుకు నిర్మించలేదు? ముఖ్యమంత్రి పాలన మాటలకే పరిమితమైనది తప్ప చేతలకు కాదని ఇవి నిరూపిస్తున్నాయి. 

ఈ ఎన్నికలలో తెరాస అనుబంధ సంస్థ టిబిజికెఎస్ ఓటమి ఖాయం అని గ్రహించినందునే ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులను, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలను ఎన్నికల ప్రచారానికి పంపించారు. అయినా ఫలితం ఉండదనే భయంతోనే ఆయనే స్వయంగా కలుగజేసుకొని సింగరేణి కార్మికులకు ఎన్నికలకు ముందు తాయిలాలు ప్రకటిస్తున్నారు. 

ఈ ఎన్నికలలో బి.ఎం.ఎస్. విజయమే 2019 శాసనసభ ఎన్నికలకు భాజపా విజయానికి పునాది కావాలి. కనుక సింగరేణి కార్మికులను మాయమాటలతో మభ్యపెడుతున్న తెరాస సర్కార్ కు బుద్ధి చెప్పడానికి కార్మికులు అందరూ బి.ఎం.ఎస్.కే ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని కిషన్ రెడ్డి కోరారు.