సింగరేణి ఎన్నికల ప్రచారానికి నేడే చివరిరోజు

సార్వత్రిక ఎన్నికలకు తీసిపోని రీతిలో సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలలో అధికార, ప్రతిపక్ష పార్టీలు చాలా ఉదృతంగా ప్రచారం చేస్తున్నాయి. అక్టోబర్ 5వ తేదీన పోలింగ్ జరుగనున్నందున ఈరోజు (మంగళవారం) సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచార సమయం ముగియనుంది. కనుక ఇవ్వాళ్ళ అన్ని పార్టీలు మరింత ఉదృతంగా ప్రచారం చేయడానికి సిద్దం అవుతున్నాయి.

సింగరేణిలో సుమారు 15కు పైగా కార్మిక సంఘాలు ఉన్నప్పటికీ పోటీ ప్రధానంగా తెరాస అనుబంధ తెలంగాణా బొగ్గుగని కార్మిక సంఘానికి (టిబిజికెఎస్), ప్రతిపక్షాలన్నీ బలపరుస్తున్న ఏఐటియుసికి మద్యనే ప్రధానంగా జరుగనున్నాయి.

ఇవి సార్వత్రిక ఎన్నికలన్నట్లు భావిస్తూ తెరాస మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ సింగరేణి కార్మికులను ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తెరాసయే అధికారంలో ఉండటం వారికి సానుకూల అంశంగా మారింది. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు జీతాలు, బారీగా బోనసులు ప్రభుత్వం అందజేసింది. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వారసత్వ ఉద్యోగాలకు బదులు కారుణ్య నియామకాలు చేపడతామని వాగ్దానం చేస్తోంది. సింగరేణి కార్మికులను ఆకట్టుకోవడానికి ఇంకా అనేక హామీలు, వరాలు గుప్పిస్తోంది.

సింగరేణి ఏరియాలలో ఇప్పుడు నల్లటి బొగ్గుకు బదులు గులాబీ రంగు జెండాలు, బ్యానర్లే ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాల కంటే తెరాసయే ముందంజలో ఉంది. టిబిజికెఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కవిత ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు సింగరేణి ఏరియాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.