హైదరాబాద్ లో భారీ వర్షం..ట్రాఫిక్ జామ్స్

హైదరాబాద్ జంటనగరాలలో సోమవారం సాయంత్రం హటాత్తుగా చాలా బారీ వర్షం మొదలయింది. ఉదయం అంతా ఎండగా ఉండి ఎటువంటి వర్షపు సూచన కనబడలేదు. సాయంత్రం 4-5 గంటలకు మెల్లగా ఆకాశమంతా దట్టమైన మబ్బులు కమ్ముకోవడంతో నగరమంతా చిమ్మచీకటిగా మారింది. మరి కాసేపటికి కుండపోతగా వాన మొదలై రాత్రి 8 గంటలైనా ఇంకా బారీగా కురుస్తూనే ఉంది. దానితో దాదాపు నగరమంతా నీట మునిగింది. లోతట్టు ప్రాంతాలలో రోడ్లపై మూడడుగుల వరకు నీరు ప్రవహిస్తుండటంతో ద్విచక్రవాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. అనేక చోట్ల కార్లు దాదాపు నీట మునిగాయి. రోడ్లు కనపడనంతగా నీళ్ళు చేరుకోవడంతో నగరంలో అనేకప్రాంతాలలో బారీగా ట్రాఫిక్ జామ్స్ ఏర్పడ్డాయి. కిలో మీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ లో పలు ప్రాంతాలలో సుమారు 6-8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అవడం విశేషం. ఈ బారీ వర్షానికి ఈదురుగాలులు కూడా తోడవడంతో నగరంలో అనేక చోట్ల చెట్లు రోడ్డుకి అడ్డంగా కూలిపోవడంతో వాటి కారణంగా కూడా ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి.         

నగరంలో అంబర్ పేట్, నల్లకుంట, హిమాయత్ నగర్, విద్యానగర్, నాంపల్లి, చిక్కడపల్లి, గాంధీనగర్‌, ముషీరాబాద్‌, రాంనగర్, చార్మినార్, గోషామహల్‌ మొదలైన ప్రాంతాలలో రోడ్లపైకి బారీగా నీళ్ళు చేరాయి. నాలాలు పొంగి ప్రవహిస్తుండటంతో అడుగు ముందుకు వేస్తే ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే అవుతోంది. మెహిదీపట్నం, మలక్ పేట్, సంతోష్ నగర్, ఉప్పల్, రామాంతపూర్, సనత్ నగర్ తదితర ప్రాంతాలలో కొన్ని ఇళ్ళలోకి నీళ్ళు ప్రవేశించడంతో అందులో నివసిస్తున్నవారు చాలా ఆందోళన చెందుతున్నారు. 

బారీ వర్షం కురుస్తుండటంతో అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరికొన్ని చోట్ల విద్యుత్ శాఖవారే ముందు జాగ్రత్తచర్యగా విద్యుత్ నిలిపివేయడంతో ఎప్పుడూ విద్యుత్ కాంతులతో ధగధగ మెరిసే హైదరాబాద్ నగరంలో చీకట్లు కమ్ముకొన్నాయి. 

సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్ళకు బయలుదేరినవారు రాత్రి 8.30 గంటలైనా ఇంకా వర్షంలో, ట్రాఫిక్ లో చిక్కుకొనిపోయున్నారు. ఇంకా ఎప్పటికి ట్రాఫిక్ క్లియర్ అవుతుందో తెలియక రోడ్లపై చాలా ఇబ్బందిపడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరికొన్ని గంటలపాటు ఇదే స్థాయిలో బారీగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించడంతో, ప్రజలను ఇళ్ళలో నుంచి బయటకు రావద్దని జి.హెచ్.ఎం.సి., పోలీస్ సిబ్బంది హెచ్చరిస్తున్నారు.

 ఈరోజు కురిసిన ఈ బారీ వర్షాలు హైదరాబాద్ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ వైఫల్యానికి అద్దం పట్టాయి. కనుక ఈ స్థాయిలో వర్షాలు కురిసినా తట్టుకొనేవిధంగా నగరంలో డ్రైనేజీ వ్యవస్థను సమూలంగా ఆధునీకరించవలసిన అవసరం ఉందని స్పష్టం అయ్యింది.