ఏపిలో కేసీఆర్ కు నీరాజనాలు

ఏపి మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం వివాహానికి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న హాజరైనప్పుడు, ఆయనను చూసేందుకు అనంతపురం ప్రజలు చాలా ఆసక్తి చూపారు. ఆయన నిన్న పుటపర్తి విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్ ద్వారా వెంకటాపురం గ్రామం చేరుకొన్నప్పుడు, ఆయనను చూసేందుకు స్థానిక ప్రజలు బారీ సంఖ్యలో తరలివచ్చారు. పెళ్ళికి వచ్చిన అతిధులు కూడా ఏపి సిఎం చంద్రబాబు నాయుడు కంటే కేసీఆర్ ను చూసేందుకే ఆసక్తి చూపారు. పరిటాలవారి వివాహవేడుకలో కేసీఆర్ ‘సెంటర్ ఆఫ్ అట్రాక్షన్’ గా నిలవడం విశేషం. అనంతరం ఆయన పరిటాల సునీతతో కలిసి పరిటాల రవి సమాధిని సందర్శించి నివాళులు అర్పించినప్పుడు ఆయనను చూసేందుకు బారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఆయన పుటపర్తికి బయలుదేరే ముందు సీనియర్ తెదేపా నేత పయ్యావుల కేశవ్ ను పక్కకు పిలిచి ఏదో మాట్లాడటం మరో విశేషం. తెలంగాణా తెదేపా నేతలతో ఎన్నడూ మాట్లాడని కేసీఆర్, ఆంధ్రాకు చెందిన తెదేపా నేతతో ఎందుకు మాట్లాడారు? ఏమి మాట్లాడారనే దానిపై మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఒకప్పుడు తెలంగాణా ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్నప్పుడు రాష్ట్రవిభజనను వ్యతిరేకించిన ఆంధ్రా ప్రజలు అందరూ, అందుకు పట్టుబడుతున్న కేసీఆర్ ను చాలా ద్వేషించారు. కానీ తెలంగాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన తెలంగాణా రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలో నడిపిస్తున్న తీరును చూసి ఆంధ్రా ప్రజలు కూడా ఆయనను అభిమానించసాగారు. అందుకే కేసీఆర్ ఎప్పుడు ఆంధ్రాలో అడుగుపెట్టినా ఆయనకు అక్కడి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. అయితే ఆయన గొప్పదనాన్ని ఆంధ్రాప్రజలు గుర్తించారు కానీ తెలంగాణాలో ప్రతిపక్షాలు మాత్రం గుర్తించడానికి ఇష్టపడటం లేదు.