ఈసారి కూడా మోత్కుపల్లికి నిరాశే

తమిళనాడు, బిహార్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ కు ఆదివారంనాడు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. 

తమిళనాడు: బన్వారీలాల్ పురోహిత్, బిహార్: సత్యపాల్ మాలిక్, అరుణాచల్ ప్రదేశ్: బిడి మిశ్రా, మేఘాలయ గంగా ప్రసాద్, అండమాన్ నికోబార్ ద్వీపాలు: దేవేంద్రకుమార్ జోషీ   

తాజా నియామకాలతో, చిరకాలంగా గవర్నర్ పదవి కోసం ఎదురుచూపులు చూస్తున్న తెలంగాణా తెదేపా సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులుకు మరొకసారి నిరాశ తప్పలేదు. కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటికి మూడు నాలుగుసార్లు గవర్నర్ల నియామకాలు జరిగాయి. ఆ ప్రస్తావన వచ్చిన ప్రతీసారి మోత్కుపల్లికి తప్పకుండా అవకాశం కల్పిస్తారని వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ ఊహాగానాలుగానే మిగిలిపోయాయి కనుక ఆయన ఎన్నడూ గవర్నర్ అయ్యే అవకాశాలు లేనట్లే భావించవచ్చు. 

తీవ్ర రాజకీయ సంక్షోభంలో ఉన్న తమిళనాడుకు ఇన్-ఛార్జ్ గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్ రావు స్థానంలో పూర్తి స్థాయి గవర్నర్ ను నియమించడం చూస్తే త్వరలో అక్కడి రాజకీయ అనిశ్చితికి తెర దించేందుకు కేంద్రప్రభుత్వం ఏదో తీవ్ర నిర్ణయం తీసుకోబోతున్నట్లుంది.