ముంబై సమీపంలో ఎలిఫిన్ స్టోన్ రైల్వే స్టేషన్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై కొద్దిసేపటి క్రితం జరిగిన త్రొక్కిసలాటలో 22 మంది చనిపోగా మరో 25 మందికి పైగా గాయపడ్డారు. రైల్వే అధికారులు గాయపడినవారిని అందరినీ స్థానిక కెఈఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే పరేల్ నుంచి ఎలిఫిన్ స్టోన్ రోడ్డువైపు వెళ్ళే మార్గాన్ని ట్రఫిక్ పోలీసులు మూసివేసి వాహనాలను వేరేమార్గం గుండా పంపిస్తున్నారు. ముంబై ను కలుపుతూ సాగే అన్ని రైల్వే స్టేషన్లు ఎప్పుడూ చాలా రద్దీగానే ఉంటాయి. కానీ సాధారణంగా ఇటువంటి ప్రమాదాలు జరుగవు. అకస్మాత్తుగా బారీ వర్షం కురియడంతో ప్రయాణికులు ఒక్కసారిగా రైల్వే బ్రిడ్జిలోకి ప్రవేశించడంతో త్రొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇంతమంది చనిపోవడం, గాయపడటం చాలా బాధాకరమని, బాధితులకు, వారి కుటుంబాలకు ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నామని ముంబై పోలీస్ శాఖ ట్విట్టర్ లో సంతాప సందేశం పెట్టింది. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ముంబైలో ఉండటంతో ఆయన తక్షణం ఎలిఫిన్ స్టోన్ రైల్వే స్టేషన్ కు వచ్చి రైల్వే, పోలీస్ అధికారులతో మాట్లాడి అవసరమైన సూచనలు చేశారు.