బతుకమ్మ అంటే సంతోషంగా ఆడాలే తప్ప...

తెలంగాణా ప్రజల సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేది బతుకమ్మ పండుగ. తెలంగాణా ప్రజలు ఆ పండుగను ఎప్పటి నుంచో జరుపుకొంటున్నప్పటికీ, ఇంతకాలం సమైక్యరాష్ట్రంలో ఆంధ్రా పాలకులే పెత్తనం సాగించడంతో అంత విశిష్టమైన పండుగకు ఎటువంటి ప్రాముఖ్యత లేకుండా చేశారు. కానీ తెలంగాణా రాష్ట్రం ఏర్పడి, తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి, దానికి అన్ని విధాల ప్రోత్సహించడంతో ఇప్పుడు రాష్ట్రమంతటా ఆ పండుగను ఘనంగా జరుపుకొంటున్నారు. దాని ప్రాశస్త్యం, ప్రాముఖ్యత గురించి దేశవిదేశాలలో ప్రజలకు తెలిసివస్తుండటంతో దేశదేశాలలో కూడా ఇప్పుడు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకొంటున్నారు.

అంతేకాదు...హైదరాబాద్ లో ఏటా ఘనంగా నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకలకు ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు కూడా వచ్చి పాల్గొంటున్నారు. ఒకప్పుడు తెలంగాణా ఉద్యమాలు చాలా ఉదృతంగా సాగుతున్న సమయంలో ఈ బతుకమ్మ పండుగే అందరినీ కలిపింది. మహిళలు కూడా తెలంగాణా ఉద్యమాలలో చురుకుగా పాల్గొనేలా చేసింది. ఇప్పుడు మన బతుకమ్మ పండుగ జాతీయస్ఫూర్తిని పెంచేందుకు కూడా దోహదపడుతుండటం విశేషం. వివిధ రాష్ట్రాల నుంచి దేశాల నుంచి మహిళలు వచ్చి ఈ ఉత్సవాలలో పాల్గొనడమే అందుకు చక్కటి నిదర్శనం. 

అచ్చమైన తెలంగాణా పండుగైన ఈ బతుకమ్మ పండుగకు మరింత ప్రాశస్త్యం కలిగించడానికే హైదరాబాద్ లో జరిగే బతుకమ్మ ఉత్సవాలలో వేలాదిమంది మహిళలతో బతుకమ్మ ఆడించి గిన్నీస్ బుక్ రికార్డులోకి ఎక్కించడం జరిగింది. అది అందరికీ గర్వకారణమే కావాలి కానీ దానినీ తప్పు పట్టేవారుండటం విస్మయం కలిగిస్తుంది. 

తెలంగాణ యునైటెడ్‌ ఫోరం (టఫ్‌) రాష్ట్ర అధ్యక్షు రాలు విమలక్క నిన్న వరంగల్ పట్టణంలోని ముచ్చర్లలో బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న తరువాత మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో మహిళలు అందరూ ముచ్చటగా, భక్తి శ్రద్దలతో ఆడిపాడుకొనేది బతుకమ్మ పండుగ. కానీ దానిని తెరాస సర్కార్ ఒక కార్పోరేట్ వ్యవహారంగా మార్చేసింది. ఊరూవాడా అందరూ ఏకమై సంతోషంగా అడాల్సిన బతుకమ్మను గిన్నీస్ బుక్ కోసం ఆడటం ఏమిటి? దానికి ఏర్పాట్లు పేరు చెప్పుకొని తెరాస నేతలు జేబులు నింపుకొన్నారు,” అని విమర్శించారు.