సింగరేణి కార్మికులకు డబుల్ బోనస్

దసరా, దీపావళి పండుగల సందర్భంగా సింగరేణి ఉద్యోగులు శుక్రవారం బోనస్ అందుకోబోతున్నారు. ఉద్యోగులు అందరికీ వారి బ్యాంక్ ఖాతాలలో ఈరోజే బోనస్ సొమ్మును జమా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. 

ఈసారి సింగరేణి ఉద్యోగులు నెలవారీ జీతంతో బాటు ఒకేసారి రెండు బోనసులు అందుకోబోతున్నారు. సాధారణంగా దీపావళికి చెల్లించబడే పిఎల్ఆర్ బోనస్ తో బాటు 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన లాభాలలో 25 శాతం వాటాను ఉద్యోగులకు బోనస్ చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

ఆ లెక్కన ఒక్కో కార్మికుడికి సాధారణ బోనస్ సుమారు రూ.57,000 తో బాటు లాభాలలో వాటాగా మరో రూ.15-20,000 కలిపి సుమారు రూ. 72-77,000 వరకు బోనస్ అందబోతోంది. దానితో వారి జీతాలను కూడా కలుపుకొంటే ఒక్కో కార్మికుడు కనీసం లక్ష రూపాయలు అందుకొంటాడు. దసరా పండుగకు ఒక రోజు ముందే ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు చేతిలోపడితే ఇక అంతకంటే గొప్ప పండుగ ఏముంటుంది? ఇప్పటికే ఈవార్త కార్మికుల చెవికి చేరడంతో వారందరూ ఆనందోత్సాహాలతో పొంగిపోతున్నారు. ఇక అక్టోబర్ 5న జరుగబోయే కార్మిక సంఘాల ఎన్నికలలో వారు ఎవరికీ ఓట్లు వేస్తారో వేరే చెప్పనవసరం లేదు.