సింగరేణిలో కూడా ప్రలోభాలేల?

సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ అధికార, ప్రతిపక్షాల మద్య మాటల యుద్ధం తీవ్రం అవుతోంది. తెరాస నేతలు కార్మికులను బెదిరించి భయపెడుతూ, విచ్చల విడిగా డబ్బులు పంచుతూ వారిని తమవైపు తిప్పుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు అందరూ సింగరేణిలో తిష్టవేసి కార్మికులపై తీవ్ర ఒత్తిడి సృష్టిస్తున్నారని విమర్శించారు. తెరాస నేతలు ఇతర సంఘాల నేతల ఇళ్ళకు రాత్రిపూట రహస్యంగా వెళ్ళి లక్షల రూపాయలు ఇచ్చి ప్రలోభపెట్టి టిబిజికెఎస్ ఫిరాయింపజేస్తూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

తెరాస ఎల్లప్పుడూ అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతూ రాజకీయాలు చేస్తుంటుందని కానీ తమ సంఘం మాత్రం ఎల్లప్పుడూ కార్మికుల సంక్షేమం కోసమే పనిచేస్తుంటుందని చాడ వెంకటరెడ్డి అన్నారు. ఊసరవెల్లిలా పార్టీలు మారుతూ తెరాసలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటివారి మాటలు నమ్మవద్దని, కార్మికుల కోసం పనిచేసే ఏఐటియుసికే ఓట్లు వేసి గెలిపించాలని సింగరేణి కార్మికులకు చాడ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు.