తెరాస సర్కార్ రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, కాంగ్రెస్, తెదేపా, వామపక్షాల నేతలు స్పష్టం చేశారు. గ్రామ పంచాయితీలను నిర్వీర్యం చేసి, రైతుల మద్య గొడవలు సృష్టించడానికి మాత్రమే ఈ రైతు సమన్వయ సమితిలు ఉపయోగపడతాయని ప్రొఫెసర్ కోదండరామ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉన్న వ్యవస్థలను ఉపయోగించుకోకుండా, మళ్ళీ కొత్తవాటిని ఎందుకు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. ఈ సమితులలో తెరాస నేతలకు, కార్యకర్తలకు తప్ప అర్హులైన రైతులకు, స్థానిక సంస్థల ప్రతినిధులకు చోటు దక్కలేదని ఉత్తం కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ రైతు సమన్వయ సమితిల ద్వారా తెరాస నేతలు, కార్యకర్తలు గ్రామాలపై కర్ర పెత్తనం చేసే ప్రమాదం ఉందని చాడా వెంకట రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కనుక రైతులకు ఏవిధంగానూ ఉపయోగపడకపోగా ఇంకా నష్టపరిచే ఈ రైతు సమన్వయ సమితిలను వ్యతిరేకిస్తూ అక్టోబర్ 3వ తేదీ నుంచి అన్ని గ్రామ పంచాయితీలు, మండల పరిషత్ కార్యాలయాల ఎదుట సత్యాగ్రహం పేరుతో నిరసన దీక్షలు నిర్వహిస్తామని ప్రొఫెసర్ కోదండరామ్ ప్రకటించారు. దానిలో తాము కూడా పాల్గొంటామని ప్రతిపక్ష పార్టీల నేతలు తెలియజేశారు.
త్వరలో జరుగబోయే శాసనసభ సమావేశాలలో ఈ రైతు సమన్వయ సమితులకు చట్టబద్దత, కార్పోరేషన్ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అప్పుడు ప్రతిపక్షాలు ఎన్ని ఆందోళన కార్యక్రమాలు చేసినా..న్యాయస్థానాలకు వెళ్ళినా ప్రయోజనం ఉండదు. కనుక ఈ విషయంలో అవి ప్రభుత్వాన్ని అడ్డుకోవడం దాదాపు అసంభవంగానే కనిపిస్తోంది.