రాష్ట్రం విడిపోతే తెలంగాణా పరిస్థితి ఏమిటని ఆంధ్రా పాలకుల వ్యక్తం చేసిన సందేహాలకు నిత్యం వరుసగా సమాధానాలు లభిస్తూనే ఉన్నాయి. తెలంగాణా ఏర్పడి కేవలం మూడేళ్ళే అయినా అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీపడుతూ నెంబర్: 1 స్థానంలో నిలుస్తోంది. తెలంగాణా రాష్ట్రం వివిధ రంగాలలో సాధిస్తున్న అభివృద్ధికి నిదర్శనంగా నిత్యం ఏదో ఒక జాతీయ అవార్డు అందుకొంటూనే ఉంది. ఈసారి ఒకటీ రెండూ కాదు..ఏకంగా 8 అవార్డులు అందుకొంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జాతీయ పర్యాటక శాఖ తెలంగాణా రాష్ట్రానికి పర్యాటక రంగంలో వివిధ కేటగిరీలలో 8 అవార్డులు ప్రధానం చేసింది.
తెలంగాణా రాష్ట్ర పర్యాటక శాఖ వివిధ విభాగాలలో పొందిన అవార్డులు
ఇవే: 1. స్వచ్ఛత, 2. బెస్ట్ టూరిస్ట్ గైడ్, 3. బెస్ట్ టూరిజం ప్రమోషన్ పబ్లిసిటీ మెటీరియల్, 4. బెస్ట్ హెరిటేజ్ సిటీ (వరంగల్), 5. బెస్ట్ మెయింటెయిన్డ్ అండ్ డిసేబుల్డ్ ఫ్రెండ్లీ మాన్యుమెంట్, 6. సివిక్ మేనేజ్ మెంట్ టూరిస్ట్ డెస్టినేషన్ ఇన్ ఇండియా (జిహెచ్ఎంసీ), 7. బెస్ట్ స్టాండ్ అలోన్ కన్వెన్షన్ సెంటర్ (లోనియా ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్), 8. బెస్ట్ మెడికల్ టూరిజం ఫెసిలిటీ (అపోలో హెల్త్ సిటీ, హైదరాబాద్).
డిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో బుధవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వాధికారులు ఈ అవార్డులు అందుకొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ అవార్డులు స్వీకరించినవారు: తెలంగాణ పర్యాటకశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి, టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ కమిషనర్ సునీత భగవత్, ఎం.డి. క్రిస్టినా చోంగ్తు, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి, వరంగల్ మేయర్ నరేందర్, గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఓఝా, చౌమొహల్లా ప్యాలెస్ స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు, సీనియర్ గైడ్ కాశీనాథ్.