ఎవరినీ భయపెట్టలేదు..బలవంతం చేయలేదు: కవిత

అక్టోబర్ 5న జరుగబోయే సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలలో తెరాసకు అనుబంద సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టిబిజికెఎస్) తరపున ఉదృతంగా ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్న తెరాస ఎంపి కవిత నిన్న మీడియాతో మాట్లాడుతూ, “ఇదివరకు పాలేరు ఉపఎన్నికలలో ఏవిధంగా ఘనవిజయం సాధించామో, సింగరేణి ఎన్నికలలో కూడా అదేవిధంగా విజయం సాధించబోతున్నాము. మేము ఇతర సంఘాల నేతలను ప్రలోభపెట్టో లేదా భయపెట్టో మా సంఘంలో చేర్చుకొంటున్నామని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలలో నిజం లేదు. మేము సింగరేణి కార్మికుల కోసం ఏమేమి చేయబోతున్నామో...మా సంఘం ఆశయాలను, మా లక్ష్యాలను వివరించి వారిని ఒప్పించి మా సంఘంలో చేర్చుకొంటున్నాము. వాస్తవానికి ప్రతిపక్షాలే సింగరేణి ఎన్నికలపై రాజకీయాలు చేస్తున్నాయి. మమ్మల్ని ఓడించేందుకు అవి చేతులు కలిపినప్పుడే అది రుజువయింది. ఒకప్పుడు ఉప్పునిప్పులా ఉండే ఏఐటియుసి, ఐ.ఎన్.టి.యు.సి.లు నిసిగ్గుగా చేతులు కలిపాయి. అప్పుడే అవి తమ ఓటమిని అంగీకరించినట్లయింది. అయినప్పటికీ అవి మా టిబిజికెఎస్ ను ఓడించలేవని ఖచ్చితంగా చెప్పగలను. 

మా సంఘం అధికారంలోకి వస్తే కోర్టు విధించిన ఆంక్షలను పరిగణనలోకి తీసుకొని అందుకు అనుగుణంగా వారసత్వ ఉద్యోగాల నియామకాలు చేపడతాము. కార్మికుల సంక్షేమం కోసం మేము ఏమేమి చేయాలో అవన్నీ తప్పకుండా చేస్తాము. కొన్ని సమస్యల పరిష్కారానికి కోల్ ఇండియా అనుమతులు కూడా అవసరం కనుక దానితో కూడా మేము మాట్లాడుతున్నాము. మేము అధికారంలో ఉన్నాము కనుకనే ఇవన్నీ చేయగలుగుతున్నాము. అధికారంలో లేని ప్రతిపక్షాలు మద్దతు ఇస్తున్న ఏఐటియుసికి ఓట్లు వేయడం వలన అది కార్మికులకు ఏమీ చేయలేదు. కనుక సింగరేణి కార్మికులు అందరూ మా టిబిజికెఎస్ కే ఓట్లు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాము,” అని అన్నారు.