మహిళలకు 6 మంత్రి పదవులు పక్కా

వరుసగా రెండవసారి తెలంగాణా తెదేపాకు అధ్యక్షుడుగా నామినేట్ అయిన ఎల్.రమణ నిన్న పార్టీ ప్రధానకార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన బతుకమ్మ వేడుకలకు హాజరైన మహిళలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “తెరాస సర్కార్ లో ఒక్క మహిళకు కూడా చోటు కల్పించలేదు. అలాగే తెరాసలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితకు తప్ప మరెవరికీ ప్రాధాన్యం ఉండదు. రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి వస్తే మహిళలకు 6 మంత్రి పదవులు, ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవిస్తాము,” అని చెప్పారు. 

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు..ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు ఎన్ని మాటలైనా చెప్పవచ్చు కానీ అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలుచేయడమే కష్టం. అయినా తెలంగాణాలో తెదేపా పరిస్థితి గురించి అందరికీ తెలిసిందే కనుక అది ఇంకా ఎన్ని వాగ్దానాలు చేసినా ఇబ్బంది ఉండదు. అదే ఇప్పుడు అధికారంలో ఉన్న తెరాస చేస్తే వాటి గురించి తప్పకుండా ఆలోచించవలసి ఉంటుంది.