డేరాబాబా..గుర్మీత్ రాం రహీం సింగ్ కు అత్యాచారం కేసులో 20 ఏళ్ళు జైలుశిక్ష పడగానే అంతకాలం అతనికి కుడిభుజంగా వ్యవహరించిన హనీప్రీత్ సింగ్ నేపాల్ పారిపోయిందని పోలీసులు అక్కడ వెతుకుతుంటే, డేరాబాబా రాసలీలపై అప్పుడే సినిమా మొదలుపెట్టిన రాఖీ సావంత్, హనీ ప్రీత్ సింగ్ లండన్ పారిపోయిందని చెప్పింది.
కానీ ఆమె ఎక్కడికీ పారిపోలేదు ప్రస్తుతం డిల్లీలో ఒక రహస్య ప్రదేశంలో ఉందని ఆమె తరపున డిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ఆమె లాయర్ ప్రదీప్ ఆర్య తెలిపారు. సంబంధిత పత్రాలపై సంతకాలు చేయడం కోసం ఆమె కొన్ని రోజుల క్రితమే డిల్లీలోని తన కార్యాలయానికి కూడా వచ్చారని తెలిపారు. ఆ తరువాత మళ్ళీ ఆమె తనను కలవలేదని, అవసరమైనప్పుడు ఫోన్ లోనే మాట్లాడుతున్నారని ప్రదీప్ ఆర్య తెలిపారు.
గుర్మీత్ రాం రహీం సింగ్ కేసులలో తన క్లైంట్ హనీప్రీత్ సింగ్ పై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని, ఆ కేసులో ఆమెను అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నందున ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు ప్రదీప్ ఆర్య తెలిపారు. మంగళవారం ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.
డేరాబాబాకు శిక్ష విధించేవరకు హనీప్రీత్ సింగ్ పోలీసుల కళ్ళెదుటే ఉంది కానీ ఆ తరువాత హటాత్తుగా గాలిలా కనబడకుండా మాయం అయిపోయింది. ఈ కేసులో కీలక నిందితురాలైన ఆమె ఏ క్షణంలోనైనా పరరాయ్యే అవకాశం ఉందని చంటి పిల్లాడు కూడా చెప్పగలడు కానీ ఇది పోలీసులకు తెలియదంటే నమ్మశక్యంగా లేదు. స్థానిక పోలీసుల సహకారంతోనే ఆమె, ఆమె అనుచరులు తప్పించుకోగలిరనేది బహిరంగ రహస్యం.
ఇప్పుడు ఆమె డిల్లీలో ఉన్నారని, తనకు తరచూ ఫోన్ చేస్తోందని ఆమె న్యాయవాది చెపుతున్నారు. అయినా పోలీసులు ఆమెను పట్టుకోలేకపోతున్నారమతే నమ్మశక్యంగా లేదు. ఒకవేళ హైకోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించినట్లయితే ఆమె మళ్ళీ మాయం అయిపోవడం ఖాయం. ఆమె ఆచూకీ తెలుసుకొని అరెస్ట్ చేయగలిగే శక్తిసామర్ద్యాలు పోలీసులకు ఉన్నప్పటికీ ఆమెను పట్టుకోకపోవడం చూస్తుంటే, నిద్రపోయేవాడిని మేల్కొలపగలం కానీ నిద్ర నటించేవాడిని లేపలేమన్నట్లనిపించక మానదు.