కమీషనర్ నే కొట్టిన ఘనులు

రాష్ట్ర ప్రభుత్వం ఫ్లెక్సీ బ్యానర్లు నిషేధించి చాలా కాలమే అయ్యింది. ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టవద్దని మున్సిపల్ మంత్రి కేటిఆర్ చాలాసార్లు తెరాస నేతలకు చెపుతూనే ఉన్నారు. అయినా వారు ఫ్లెక్సీ బ్యానర్స్ పెట్టడం మానుకోవడం లేదు. పైగా వాటిని తొలగించడానికి ప్రయత్నించినందుకు ఇల్లెందు మున్సిపల్ కమీషనర్ రవిబాబుపై దాడి చేశారు కూడా. 

ఆయన ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది పట్టణంలో తెరాస ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్లు తొలగిస్తునందుకు తెరాస నేతలు జానీ పాషా, సత్యనారాయణ, గణేష్, మదారమ్మ తదితరులు ఆగ్రహంతో నిన్న కమీషనర్ రవిబాబు ఇంటికి వెళ్ళి ఆయనపై దాడి చేశారు. వారిని అడ్డుకొబోయిన ఆయన భార్యను పక్కకు త్రోసేయడంతో ఆమె కొద్దిగా గాయపడ్డారు. 

ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో తెరాస నేతలపై పిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. ఈవిషయం తెలుసుకొన్న మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు పోలీస్ స్టేషన్ కు తరలివచ్చి నిరసన తెలుపుతూ రోడ్డుపై కూర్చొని కాసేపు ధర్నా చేశారు. మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు నిన్న విధులు బహిష్కరించి నిరసనలు తెలియజేశారు.  పట్టణంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు ఒక వ్యానులో చెత్తను తీసుకువచ్చి జగదాంబ సెంటర్ లో కుప్పపోసి తమ నిరసన తెలియజేశారు. కమిషనర్ రవిబాబుపై దాడిచేసిన తెరాస నేతలపై కేసు నమోదు చేసి ఊరుకోకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.