లక్ష్మణ్ నోట..భాజపా మనసులో మాట

తెలంగాణా భాజపా అధ్యక్షుడు కె.లక్ష్మణ్ నిన్న మీడియాతో మాట్లాడుతూ తమ లక్ష్యం వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో 10 లోక్ సభ స్థానాలను గెలుచుకోవడమేనని చెప్పేశారు. అయితే యధాప్రకారం ‘వచ్చే ఎన్నికలలో తెరాస, కాంగ్రెస్ పార్టీలను ఓడించి రాష్ట్రంలో తాము అధికారంలోకి రావడం ఖాయం అని ముక్తాయించారు. కానీ భాజపా లక్ష్యం తెలంగాణాలో వీలైనన్ని ఎక్కువ లోక్ సభ స్థానాలు గెలుచుకోవడమే తప్ప అధికారంలోకి రావడం కాదనే విషయం ఆయన మాటలతో స్పష్టం అయ్యింది. రాష్ట్రంలో తమ పార్టీ పరిస్థితి, దాని బలాబలాలపై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉందని అర్ధమవుతోంది. అయితే ఎన్నికలకు ఏడాదిన్నర ముందుగానే ఓటమిని అంగీకరించడం ఆత్మహత్యతో సమానం అవుతుంది కనుక యధాప్రకారం తామే గెలిచి అధికారంలోకి వస్తామని లక్ష్మణ్ పాట పాడారు.

“తెలంగాణా విమోచన యాత్రకు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వచ్చింది. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇతర పార్టీలకు చెందిన అనేక మంది నేతలు సరైన సమయం చూసుకొని భాజపాలో చేరబోతున్నారు. తెరాస సర్కార్ నిరంకుశ వైఖరి, మాటల గారడీలతో రాష్ట్ర ప్రజలు విసుగెత్తిపోయున్నారు. అవినీతికి మారుపేరైన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదు. కనుక తెలంగాణాతో సహా దేశప్రజలందరూ దేశ సమగ్రాభివృద్దే లక్ష్యంగా సాగిపోతున్న మోడీ సర్కార్ పాలనను చూసి భాజపావైపే మొగ్గుతున్నారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో భాజపా తప్పకుండా గెలిచి అధికారంలోకి రావడం ఖాయం. అందుకోసం మేము రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, తెరాస సర్కార్ వైఫల్యాలు, ఇప్పటి వరకు మేము చేపట్టిన కార్యక్రమాలు, ఇక ముందు చేపట్టబోతున్న కార్యక్రమాల గురించి ఒక నివేదిక తయారుచేసి మా అధిష్టానానికి పంపించాము. వాటి ఆధారంగా మా పార్టీ భవిష్య కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతాము. 

గుజరాత్ శాసనసభ ఎన్నికల తరువాత అమిత్ షా రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారిస్తారు. మా పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అక్టోబర్ 14,15 తేదీలలో రాష్ట్రంలో పర్యటిస్తారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ తరువాత ఫిబ్రవరిలోగా లక్ష మందితో బారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాము,” అని లక్ష్మణ్ మీడియాకు చెప్పారు.