బతుకమ్మ చీరల పంపిణీపై జరుగుతున్న రభసపై తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందిస్తూ, “బట్టల మిల్లులకు కేంద్రమైన గుజరాత్ లోని సూరత్ లో చీరలను కేజీల లెక్కన అమ్ముతారని ఇక్కడ మాకు తెలిసిన కొందరు బట్టల వ్యాపారులు చెప్పారు. ఇటువంటి నాసిరకం చీరలు కేజీ రూ.250 చొప్పున అమ్ముతారని ఒక కేజికి ఆరు చీరలు తూగుతాయని వారు చెప్పారు. సిరిసిల్లలోని ఇద్దరు తెరాస కౌన్సిలర్లు సూరత్ వెళ్ళి వారి వద్ద నుంచి ఈ నాసిరకమైన బతుకమ్మ చీరలను కొనుగోలు చేసి తీసుకువచ్చినట్లు మాకు సమాచారం ఉంది. ఈ మొత్తం రూ.220 కోట్లు వ్యవహారంలో కనీసం రూ. 150 కోట్ల కుంభకోణం జరిగినట్లు మాకు అనుమానాలున్నాయి. కనుక దీనిపై తక్షణం న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కేటిఆర్ స్వయంగా పర్యవేక్షించారు కనుక ఈ అవకతవకలకు అయన కూడా బాద్యుడేనని భావిస్తున్నాము. తెరాస సర్కార్ చేపట్టిన మిషన్ భగీరథ పధకం మొదలు పేద మహిళలకు పంచి పెడుతున్న ఈ బతుకమ్మ చీరల వరకు ప్రతీ పధకంలో బారీ అవినీతి జరుగుతూనే ఉంది. ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకోవడానికి దీనిపై న్యాయవిచారణకు ఆదేశించాలని మేము డిమాండ్ చేస్తున్నాము,” అని రేవంత్ రెడ్డి అన్నారు.
సూరత్ లో అనేక బట్టల మిల్లులు ఉన్నాయి కనుక అక్కడ నుంచి అన్ని రాష్ట్రాలకు బట్టలు ఎగుమతి అవుతుంటాయనేది వాస్తవమే. అయితే రేవంత్ రెడ్డి చెపుతున్నట్లు ఒక కేజీ ఆరు చీరలు కేవలం రూ.250 కే లభిస్తాయా? తెలంగాణా ప్రభుత్వం ఏ బట్టల కంపెనీ నుంచి వాటిని కొనుగోలు చేసింది? అనే విషయాలు తేలవలసి ఉంది.