బతుకమ్మ చీరల పంపిణీ వ్యవహారంలో జరుగుతున్న రాద్దాంతంపై తెరాస నిజమాబాద్ ఎంపి కవిత తీవ్రంగా స్పందించారు. “ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలను చూసి మహిళలు మురిసిపోతూ ఆనందంతో తీసుకొంటుంటే, అది చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు మా ప్రభుత్వంపై బురద జల్లెందుకు నీచ రాజకీయాలు చేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో పంపిణీ చేసిన 5 లక్షల చీరలపై మహిళలు ఎవరూ అసంతృప్తి వ్యక్తం చేయాలేదు. ఎక్కడా చీరలు తగులబెట్టలేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపిటిసిలు, సర్పంచులు, ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాలలో మాత్రమే ఈ రభస జరుగుతుండటం గమనిస్తే, ఇదంతా కాంగ్రెస్ నేతలు రాజకీయ దురుదేశ్యంతో చేస్తున్న కుట్రే అని అర్ధం అవుతోంది. ‘అమ్మ పెట్టదు..అడుక్కు తిననివ్వదు’ అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో మహిళలకు ఏమీ చేయకపోయినా ఇప్పుడు మా ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ చీరలు కానుకగా అందిస్తుంటే దానికీ కాంగ్రెస్ నేతలు అడ్డుపడుతున్నారు. మా ప్రభుత్వంపై బురదజల్లి అప్రదిష్ట పాలు చేసేందుకు కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రయత్నాలను మహిళలే గట్టిగా త్రిప్పికొట్టి వారికి బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.