ఐలయ్యపై ఎఫ్.ఐ.ఆర్.?

ప్రముఖ రచయిత ప్రొఫెసర్ కంచె ఐలయ్యపై కేసు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ డిజిపి సాంబశివరావు పోలీసులను ఆదేశించారు. ఐలయ్య వ్రాసిన “సామాజిక స్మగ్లర్లు: కోమటోళ్లు” అనే వివాదాస్పదమైన రచనపై రెండు తెలుగు రాష్ట్రాలలో వైశ్య సంఘాలు నిరసన ర్యాలీలు నిర్వహిస్తూ ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ కులస్తులను కించపరుస్తూ ఆయన వ్రాసిన ఆ పుస్తకాన్ని నిషేదించి, తక్షణం ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని కులసంఘాలు ఆయనకు మద్దతు తెలుపుతూ ముందుకు వచ్చినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఆయనను తప్పు పట్టాయి. నానాటికీ ముదురుతున్న ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన తరువాత  కంచె ఐలయ్యపై కేసు నమోదు చేయాలని డిజిపి సాంబశివరావు పోలీసులను ఆదేశించారు.

భాజపా తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, “ఎవరూ కూడా వేరొకరిని లేదా వారి కులాన్ని, మతాన్ని కించపరుస్తున్నట్లు మాట్లాడటం, ఈవిధంగా రాతలు రాయడం సరికాదు. ఐలయ్య చేసిన ఈ పనివలన ప్రజల మధ్య చిచ్చు పెట్టినట్లయింది. దీనిని మా పార్టీ తరపున ఖండిస్తున్నాను,” అని అన్నారు.