తెలంగాణా ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకగా రాష్ట్రంలో మహిళలకు అందజేసిన చీరలు చాలా నాసిరకంగా ఉన్నాయంటూ అనేక జిల్లాలలో మహిళలు వాటిని రోడ్లపై పోసి మంటపెట్టి, వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ ఆడి ప్రభుత్వానికి తమ నిరసనలు తెలియజేశారు. ఈ చీరలు పొందినవారిలో చాలామంది రోజుకూలి చేసుకొనేవారే కావడంతో వారు చీరల కోసం తమ పని మానుకొని వచ్చారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన చీరలు కనీసం రూ.50 ఖరీదు కూడా చేయవని, వాటి కోసం అనవసరంగా ఒక రోజుకూలి పోగొట్టుకొన్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, భువనగిరి జిల్లాలో పలు ప్రాంతాలలో నాసిరకం చీరలు ఇచ్చినందుకు మహిళలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటికి మంట పెట్టారు. ప్రభుత్వం అంత డబ్బు ఖర్చు చేసి ఇంత నాసిరకం చీరలు పెట్టి తమని అవమానించిందని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేయగా, కొందరు వాటికి బదులు ఏ పప్పో ఉప్పో ఇచ్చి ఉండి ఉంటే బాగుండేదని మరికొందరు మహిళలు అభిప్రాయపడ్డారు. మరికొందరు ప్రభుత్వం ఖర్చు చేసిన ఆ డబ్బును తమకే ఇచ్చి ఉండి ఉంటే తామే మరికొంత వేసుకొని మంచి చీర కొనుకొని ఉండేవారం కదా అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక ఈ చీరల కోసం ఒకేసారి వేలాదిగా మహిళలు తరలిరావడంతో అన్ని పంపిణీ కేంద్రాలలో త్రొక్కిసలాటలు, ఆ కారణంగా మహిళల మద్య గొడవలు జరిగి కొన్ని చోట్ల కొట్టుకొనేవరకు వెళ్ళాయి. అంత పోరాడి తెచ్చుకొన్న ఆ చీరలు చాలా నాసిరకంగా ఉండటంతో మహిళల ఆగ్రహంతో భగభగలాడారు. ఆ మంటలకే అనేక చోట్ల బతుకమ్మ చీరలు మాడిమసయిపోయాయి. అసలు చీరల పంపిణీ మొదలయ్యే వరకు ఇటువంటి పరిణామాలు ఎదురవుటాయని ఎవరూ ఊహించలేకపోవడంతో అధికారులు కూడా నివ్వెరపోయే పరిస్థితి ఏర్పడింది.