అత్యంత వివాదాస్పదమైన కధాంశాన్ని, టైటిల్ ను ఎంచుకోవడంలో రామ్ గోపాల్ వర్మకు తనకు తానే సాటినని ఈరోజు మరోసారి నిరూపించుకొన్నాడు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తాను తీయబోయే సినిమా పేరు “లక్ష్మీ’స్ ఎన్టీఆర్” అని ప్రకటించాడు.
ఎన్టీఆర్ జీవితంపై తాను చేస్తున్న పరిశోధన పూర్తయిందని, తాను మొదట ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీయాలనుకొన్నానని కానీ ఆయన భార్య లక్ష్మి పార్వతితో మాట్లాడిన తరువాత తన అభిప్రాయం మారిందని తెలిపాడు. ఆ సినిమాను ఆమె చెప్పిన కోణంలో నుంచి చూపించినట్లయితే ఆయన జీవితంలో జరిగిన అనేక ఘటనలను నిష్పక్షపాతంగా చూపించడం సాధ్యం అవుతుందని, తద్వారా ఆయనను వెన్నుపోటు పొడిచినవారి నిజస్వరూపం బయటపడుతుందని తెలిపాడు. ఎన్టీఆర్ జీవితంలో ఎవరికీ తెలియని అనేక రహస్యాలు, నిజాలను ఈ సినిమా ద్వారా బయటపెట్టబోతున్నట్లు వర్మ ప్రకటించాడు.
అంటే వర్మ తీయబోతున్న ఈ సినిమాలో విలన్ ఏపి సిఎం చంద్రబాబు నాయుడేనని అర్ధం అవుతూనే ఉంది. బాబు అంటే మండిపడుతున్న లక్ష్మీ పార్వతికి ఇది ఒక గొప్ప అవకాశంగా లభించిందని చెప్పవచ్చు. వర్మ వెనుక లక్ష్మీ పార్వతి ఉందంటే ఆమె వెనుక వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వారిరువురి ఉమ్మడి శత్రువు చంద్రబాబు నాయుడే కనుక.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెల్లగా ఎన్నికల వాతావరణం కమ్ముకొంటున్నవేళ వర్మ తీయబోతున్న ఈ సినిమా తెదేపా నెత్తిన పిడుగులా పడబోతోంది కనుక ఇది తెదేపాకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి చాలా ఆందోళన కలిగించే విషయమేనని చెప్పవచ్చు. కనుక దీనిపై చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నేతలు, బాలకృష్ణ, నందమూరి కుటుంబ సభ్యులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.