రైళ్ళలో దానికీ ఒక టైం-టేబుల్

మన రైళ్ళ రాకపోకలకు టైం-టేబుల్ ఉంది. అయితే అవి ఆ సమయాలకు వస్తాయో రావా..అని ఎవరూ చెప్పలేరు. అది వేరే సంగతి. అలాగే రైళ్ళలో ప్రయాణికులు రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే నిద్రపోవచ్చుననే నిబంధన ఉంది. కానీ ఆ సంగతి చాలా మంది ప్రయాణికులకు తెలియదు. తెలిసినా ఎవరూ దానినీ పట్టించుకోరు. చాలా మంది ప్రయాణికులు పగలు కూడా నిద్రపోతుంటారు. దాని వలన తోటి ప్రయాణికులకు చాలా ఇబ్బంది కలుగుతుంటుంది. ఆ కారణంగా వారి మద్య వాగ్వాదాలు, గొడవలు జరుగుతుంటాయి.

ఒక రైల్వే ప్రయాణికుడు ఈ సమస్యను రైల్వే మంత్రికి, ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్ళడంతో రైల్వే శాఖ స్పందించింది. ఇక నుంచి రైళ్ళలో రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే పడుకొనేసమయమని ప్రకటించింది. ఆ ప్రయాణికుడి సూచనతో ఏకీభవిస్తూ నిద్రపోయే సమయాలను తెలియజేసే స్టిక్కర్లను అన్ని బోగీలలో అన్ని బెర్తులపై అతికించబోతోంది. తద్వారా ప్రయాణికుల మద్య ఘర్షణలు తగ్గించవచ్చని రైల్వే శాఖ భావిస్తోంది.

అయితే రైల్లో ప్రయాణించేవారు విచక్షణతో ఈ పద్ధతిని పాటించితే ఎటువంటి సమస్యలు ఉండవు. కానీ చాలామంది ఆ వివేకం, విచక్షణ లేనట్లు మూర్ఖంగా ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బంది పెడుతుంటారు. అటువంటి వారు ఈ తాజా నిబంధనను, నిద్రవేళలు సూచించే ఈ స్టిక్కర్లను ఖాతరు చేస్తారనుకోలేము. అయినా నియమనిబంధనలు ఉండటం చాలా అవసరం. అప్పుడే ఎవరైనా అటువంటి ప్రయాణికులను నియంత్రించే అవకాశం కొంతైనా ఉంటుంది.