అలనాటి ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతికి ఒక ఆస్తి వివాదంలో సోమవారం విచారణకు హాజరు కావలసిందిగా ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు నోటీస్ పంపింది. ఆమెకు చెన్నై, ఎగ్మూరులో గల స్థిరాస్తులున్నాయి. చెన్నైకు చెందిన ఇందర్ చంద్ అనే వ్యాపారి రూ. 5.20 కోట్లు విలువగల వాటికి 2006 సం.లో రూ.4.68 కోట్లు చెల్లించి విజయశాంతి నుంచి పవర్ ఆఫ్ అటార్నీ పొందారు. కానీ ఆ లావాదేవీ ప్రక్రియ పూర్తిచేయడంలో అతను ఆలస్యం చేయడంతో విజయశాంతి వాటిని వేరే వ్యక్తులకు అమ్మివేశారు. అప్పటి నుంచి వారిమద్య ఈ వివాదం సాగుతోంది. ఆ ఆస్తుల విలువ కూడా గణనీయంగా పెరగడంతో ఇందర్ చంద్ వాటిని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. కనుక అతను మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు విజయశాంతిని నేడు (సోమవారం) జరుగబోయే విచారణకు హాజరుకావలసిందిగా ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.