నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

బతుకమ్మ పండుగ సందర్భంగా కులమతాలకు అతీతంగా రాష్ట్రంలో పేద మహిళలందరికీ బతుకమ్మ చీరలను రాష్ట్ర ప్రభుత్వం కానుకగా అందించబోతోంది. 18 ఏళ్ళు నిండిన యువతులకు కూడా ఈ చీరలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.222 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రంలో మొత్తం 1,04,57, 610 మంది మహిళలకు బతుకమ్మ చీరలను అందించబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయంతో రాష్ట్ర చేనేత కార్మికులకు చేతి నిండా పని, రాబడి వచ్చింది. అయితే బతుకమ్మ పండుగకు తక్కువ సమయం ఉండటంతో చేనేత కార్మికులకు రూ.100 కోట్లు విలువగల చీరలను నేసే బాధ్యతను అప్పగించి, మిగిలిన రూ.122 కోట్లు విలువగల పాలిస్టర్ చీరల తయారీ ఆర్డర్ ను సూరత్ లోని బట్టల కంపెనీలకు అప్పగించింది.

ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చీరలు కనుక నాసిరకంగా ఉంటాయని అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాటి నాణ్యత, డిజైన్స్ విషయంలో ప్రభుత్వం రాజీపడలేదు. ఆకర్షణీయమైన వివిధ రంగులలో 500 వేర్వేరు డిజైన్లలో వాటిని తయారుచేయించింది. వాటిలో యువతులు, గృహిణులు, పెద్దవారికి తగినవిధంగా వేర్వేరు డిజైన్లు, రంగులలో కాటన్, పాలిస్టర్ చీరలు వేర్వేరుగా తయారుచేయించింది.

నేటి నుంచి మూడు రోజుల పాటు రేషన్ డిపోల ద్వారా ఈ బతుకమ్మ చీరల పంపిణీ జరుగుతుంది. ఇప్పటికే అందుకు అవసరమైన ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. తెల్ల రేషన్ కార్డు చూపించి మహిళలు ఈ చీరలను తీసుకోవచ్చు. ఒకవేళ వారు అనారోగ్యం లేదా మరే కారణం చేతైన స్వయంగా రేషన్ షాపులకు వచ్చి చీరలు తీసుకోలేకపోతే వారి కుటుంబ సభ్యులు వచ్చి తీసుకోవచ్చు.

వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికులకు కనీసం 8నెలలు పని కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక క్యాలండర్ రూపొందిస్తోంది. దానిలో ఏ ప్రభుత్వ శాఖ, ఏ అవసరాలకు లేదా ఏఏ పండుగలకు ఎన్ని బట్టలకు ఆర్డర్స్ ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి? వాటికి చెల్లింపులు ఎప్పుడు చేయాలి? తయారు చేయించిన వాటి పంపిణీకి నిర్దిష్టమైన తేదీలతో సహా ఆ క్యాలెండర్ లో పేర్కొనబడతాయి. వివిధ ప్రభుత్వ శాఖలు దానిని ఖచ్చితంగా అనుసరించవలసి ఉంటుంది. ఈ క్యాలెండర్ అమలులోకి వస్తే ఇక రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికులకు చేతినిండా పని, ఆదాయం రెండూ లభిస్తాయి.