అవి సమన్వయం చేసే సమితులు మాత్రమే.. కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం 100 సంచార పశువైద్యశాలలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు సమన్వయ సమితిల ఏర్పాటుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ధీటుగా సమాధానాలు చెప్పారు.

ముందుగా రైతు సమన్వయ సమితిల ద్వారా రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని, తెరాస నేతల జేబులు నింపుకోవడానికే వాటిని ఏర్పాటు చేస్తున్నారని, మళ్ళీ పటేల్ పట్వారీ వ్యవస్థలకు శ్రీకారం చుడుతున్నారనే ప్రతిపక్షాలు విమర్శలకు జవాబిలిస్తూ, “ప్రతిపక్షాలకు మేము ఏది చేసినా దానిలో తప్పులే కనిపిస్తాయి తప్ప దానిలో మంచి కనిపించదు. ఈ సమితులను సమన్వయ సమితులని ఎందుకన్నామంటే అవి అదే పని చేస్తాయి కనుక. వాటికి ఎటువంటి ప్రత్యేక హక్కులు, అధికారాలు ఉండవు. అవి ప్రభుత్వానికి, రైతులకు మద్య వంతెనలా పనిచేస్తాయి అంతే. రైతుల సంక్షేమం కోసం ఏమి చేయాలో అవి చేసే సూచనలు, సలహాల మేరకు ప్రభుత్వం తన ప్రణాలికలను రూపొందించుకొంటుంది. అలాగే రైతుల సమస్యలు, అవసరాలను బట్టి ఏవిధంగా ముందుకు సాగాలో అవి సూచిస్తాయి. కనీసం ఇటువంటి ఆలోచన కూడా చేయలేని కాంగ్రెస్, తెదేపాలు మా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. కోర్టులలో కేసులు కూడా వేస్తున్నాయి,” అని కేసీఆర్ ఆక్షేపించారు.