ఒకప్పుడు కాంగ్రెస్ హయంలో ఆధార్ కార్డులు ప్రవేశపెట్టబడినప్పుడు ప్రతిపక్షాలు దానిపై అనేక విమర్శలు, అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కానీ ఇప్పుడు అవే ఆధార్ కార్డులు ఇప్పుడు వైరస్ లాగ అంతటా వ్యాపించేసి ఇందుగలదు..అందులేదని సందేహం వలదన్నట్లు మారిపోయాయి. ఇప్పటికే బ్యాంక్ ఖాతాలు, పాన్ కార్డులకు, సిమ్ కార్డులకు, అనేక కేంద్రరాష్ట్ర ప్రభుత్వ పధకాలకు ఆధార్ తప్పనిసరయిపోయింది. ఆ జాబితాలో డ్రైవింగ్ లైసెన్స్ కూడా త్వరలో చేరబోతోంది. ఇక నుంచి కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోదలచినవారికి, ఇప్పటికే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి కూడా వాటిని ఆధార్ తో లింక్ చేయడం తప్పనిసరి కాబోతోంది. తద్వారా దేశంలో ఎక్కడ ఏ వాహన యజమానినైనా గుర్తించడం తేలికవుతుంది. త్వరలోనే దీనిని అమలులోకి తీసుకురావడానికి కేంద్ర ఉపరితల రవాణాశాఖ కసరత్తు మొదలుపెట్టింది.