సింగరేణి కార్మికులకు కవితక్క విజ్ఞప్తి

అక్టోబర్ 5 న సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటిలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ( టీబీజీకేఎస్‌) అధికార తెరాసకు అనుబందంగా పనిచేస్తోంది కనుక దానిని గెలిపించుకోవడానికి తెరాస నిజామాబాద్ ఎంపి కవిత రంగంలో దిగారు. సింగరేణి యూనియన్ ఎన్నికలలో ఎటువంటి వ్యూహం అనుసరించాలనే విషయంపై నిన్న ఆమె ప్రగతి భవన్ లో టీబీజీకేఎస్‌, తెరాస నేతలతో సమావేశమయ్యారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, “సింగరేణి కార్మికుల సమస్యలన్నీ పరిష్కరించడానికి మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. వారాసత్వ ఉద్యోగాల విషయంలో ప్రభుత్వమే ముందు చొరవ తీసుకొని జీవో జారీ చేసిన సంగతి అందరికీ తెలుసు. కానీ దానిపై పిటిషన్ దాఖలు అవడంతో అదిప్పుడు కోర్టు పరిధిలో ఉంది. అందుకే మేము దాని గురించి మాట్లాడలేకపోతున్నాము. అది అలుసుగా తీసుకొని ప్రతిపక్షాలు మా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ నేతలే డానికి అడ్డుపడ్డారు. ఇప్పుడు కూడా వారే అడ్డుపడుతున్నారు. అయితే మేము తప్పకుండా సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు సాధించిపెడతామని హామీ ఇస్తున్నాను. కనుక ఈ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని, ఆరోపణలను నమ్మవద్దని సింగరేణి కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఎన్నికలలో బాణం గుర్తుతో పోటీ చేస్తున్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికే మీరందరూ ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను, అని కవిత కోరారు.