డేరాబాబా కోరిక నెరవేరుతుందా?

అత్యాచారం కేసులో 20 ఏళ్ళ జైలుశిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధా (ఆశ్రమం) అధినేత గుర్మీత్ రాం రహీం సింగ్ చేసిన పాపాలన్నీ ఒకటొకటిగా బయటపడుతుండటంతో, జైలులో ఉన్నప్పటికీ అతనిపై కేసుల విచారణ కొనసాగుతూనే ఉన్నాయి. డేరా సౌధా ఆశ్రమం మేనేజర్ రంజిత్ సింగ్, విలేఖరి రాంచందర్ హత్య కేసులలో అభియోగాలు ఎదుర్కొంటున్న గుర్మీత్ ను హర్యానాలోని పంచకుల సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు విచారించనుంది.

ప్రస్తుతం అతను హర్యానాలో రోహతక్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతనిని బయటకు రప్పిస్తే అతని అనుచరులు మళ్ళీ రెచ్చిపోయే ప్రమాదం ఉంది కనుక జైలులో నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రెండు కేసులలో అతనిని ప్రశ్నించబోతోంది. అత్యాచారం కేసులో తనను దోషిగా నిర్ధారించినప్పుడు, గుర్మీత్ న్యాయస్థానంలో కన్నీళ్లు పెట్టుకొని ఇంతకంటే తనకు ఉరిశిక్ష వేయమని ప్రార్ధించాడు. ఒకవేళ ఈ రెండు కేసులలో కూడా అతను దోషిగా రుజువయితే న్యాయస్థానం అతనికి ఉరిశిక్ష వేస్తే ఆ కోరికా తీరుతుంది. నేడు జరుగబోయే ఈ విచారణ సందర్భంగా రాష్ట్రంలో మళ్ళీ ఎటువంటి అవాంచనీయమైన సంఘటనలు జరుగకుండా రోహతక్ పట్టణంతో సహా హర్యానాలో పలు ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.