అర్చకులకు సిఎం దసరా కానుక

చిరకాలంగా నిరాదరణకు గురవుతున్న వారిలో ఆలయాల అర్చకులు కూడా ఒకరు. ఇంతకాలానికి వారి మోర వినే నాధుడు కనబడ్డాడు. ఆయనే ముఖ్యమంత్రి కేసీఆర్. ఈరోజు ప్రగతి భవన్ లో రాష్ట్రంలోని ఆలయ అర్చకులతో సమావేశమయ్యి వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకొన్నారు. వారి సలహాలు, సూచనలు, సమస్యలను దృష్టిలో ఉంచుకొన్ని అక్కడికక్కడే కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. 

1. నవంబర్ 1వ తేదీ నుంచి ప్రభుత్వోద్యోగుల మాదిరిగానే ఆలయ అర్చకులకు కూడా ప్రభుత్వం వేతన స్కేలు అమలు చేస్తుంది. ఇక నుంచి ప్రతీ నెల 1వ తేదీనే వారి జీతాలు వారివారి బ్యాంక్ ఖాతాలలో జమా చేయబడతాయి. ఇది మొత్తం 5,625 మంది అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వర్తిస్తుంది.

2. ప్రస్తుతం రాష్ట్రంలో 1805 ఆలయాలలో నిత్య దీప ధూప నైవేద్యాల నిమిత్తం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. వాటికి అదనంగా మరొక 3,000 ఆలయాలకు కూడా నిధులు మంజూరు చేయబడతాయి.

3.  రాష్ట్రంలో దేవాలయాల నిర్వహణ, ఆధ్యాత్మిక అంశాలపై సలహాలు, పర్యవేక్షణ కోసం ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయబడుతుంది.

4. రాష్ట్రంలో అనేక ఆలయాలు దేవాదాయశాఖ పర్యవేక్షణలో నడుస్తున్నప్పటికీ, వాటిపై అధికారుల, ప్రజాప్రతినిధుల పెత్తనం తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు.

5. ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు.