హైదరాబాద్ శివార్లలో చర్లపల్లి పారిశ్రామికవాడలో గల హిందూస్తాన్ పెట్రోలియం సంస్థకు చెందిన గ్యాస్ ఫిల్లింగ్ ప్లాంట్ లో నిన్న రాత్రి బారీ ప్రేలుళ్ళతో కూడిన పెద్ద అగ్నిప్రమాదం జరిగింది. గ్యాస్ ఫిల్లింగ్ చేసే యంత్రంలో సాంకేతిక లోపం కారణంగా గ్యాస్ లీకయి సిలిండర్ ప్రేలిపోవడంతో అక్కడున్న గ్యాస్ సిలిండర్లన్నీ వరుసగా ప్రేలిపోయాయి. దానితో చాలాసేపు వరకు ఆ పరిసర ప్రాంతాలన్నీ పెద్దపెద్ద శబ్ధాలతో దద్దరిల్లిపోయాయి. ఈ ప్రమాదం గురువారం రాత్రి సుమారు 8.30 ప్రాంతంలో జరిగింది.
ఈ ప్రమాదం జరిగినప్పుడు గ్యాస్ ప్లాంట్ లో సుమారు 150-200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారందరూ భయంతో కంపెనీ బయటకు పరుగులు తీశారు. ఇంత బారీ విస్పోటనం, అగ్నిప్రమాదం జరిగినా అదృష్టవశాత్తు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు గాయపడలేదు.
కానీ భయంకరమైన ఆ ప్రేలుళ్ళ శబ్దాలు విని పరిసర ప్రాంతాల ప్రజలందరూ భయంతో ఇళ్ళు విడిచిపెట్టి దూరంగా పారిపోయారు. ఈ సంగతి తెలియగానే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఆరు ఫైర్ ఇంజన్లు సుమారు 4 గంటలపాటు పనిచేయవలసి వచ్చింది.
ప్రమాదం జరిగిన వెంటనే ముందుగా ప్లాంటుకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ట్రాఫిక్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ముందు జాగ్రత్త చర్యగా చర్లపల్లికి 5 కిమీ దూరంలోనే అన్ని వైపులా ట్రాఫిక్ నిలిపివేశారు. ఆ కారణంగా చాలా ప్రాంతాలలో బారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది కానీ వాహనాలను అనుమతించి ఉండి ఉంటే ఊహించని సమస్యలు, ప్రమాదం ఏర్పడి ఉండేది.
సిలిండర్లలో గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న సమయంలో విద్యుద్ఘాతం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, దానితో ఒక సిలిండర్ నుంచి మరొకదానికి వ్యాపించి సుమారు 30 సిలిండర్లు పేలిపోయాయని హెచ్.పి.సి.ఎల్. చీఫ్ మేనేజర్ యు.ఎస్.శర్మ చెప్పారు.
అయితే ఆ ప్లాంటులో పనిచేస్తున్న కార్మికులు చెపుతున్నది ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. గ్యాస్ ఫిల్లింగ్ చేసే యంత్రంలో ఒక ముఖ్యమైన పరికరం పాడయ్యి చాలా రోజులే అయినా దానిని మార్చకుండా తాత్కాలికంగా వెల్డింగ్ తో ఆ లోపాన్ని సరిదిద్ది, ఫిల్లింగ్ యంత్రాన్ని నిర్విరామంగా నడిపిస్తుండటం వలననే ఈ ప్రమాదం జరిగిందని చెపుతున్నారు. దసరా పండుగ సందర్భంగా గ్యాస్ సిలిండర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కనుక అదే యంత్రంపై రోజుకు రెండు షిఫ్టులలో గ్యాస్ ఫిల్లింగ్ చేయిస్తున్నారని చెప్పారు. పెరిగిన డిమాండ్ ను తట్టుకోవడానికి గ్యాస్ ఫిల్లింగ్ యంత్రం, దాని పనితీరు గురించి ఏమాత్రం అవగాహన లేని బిహారీ కార్మికులను ఈ పనికి వినియోగించడం కూడా ఈ ప్రమాదానికి కారణమని ఆ కంపెనీలో పనిచేస్తున్న తాత్కాలిక కార్మికులు చెప్పారు.