సినీ పరిశ్రమలో వారు రాజకీయాలలోకి వెళ్ళడం, రాజకీయ నేతలు సినిమలు తీయడం కొత్తేమీ కాదు మనకు. ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్ త్వరలో తెదేపా కండువా కప్పుకొని పూర్తిస్థాయి రాజకీయాలలోకి రాబోతున్నారు. అలాగే ప్రముఖ నటుడు కమల్ హాసన్ సొంత కుంపటి పెట్టుకొని రాజకీయాలలోకి ప్రవేశించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలో మరొక నటి వచ్చి చేరింది. ఆమె వాణీ విశ్వనాద్. ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్ మూవీ ఘరానా మొగుడులో చిరంజీవితో నటించిన ఈ అమ్మడు తాజాగా జయలలిత జానకి నాయక సినిమాలో తళుక్కున మెరిసింది.
వాణీ విశ్వనాద్ మీడియాతో మాట్లాడుతూ “తెలుగుదేశం పార్టీలో చేరమని నాకు బాబుగారి నుంచి ఆహ్వానం అందింది. త్వరలోనే విజయవాడ వెళ్ళి బాబుగారిని కలుస్తాను. బాబుగారి పాలన చూస్తుంటే ఏపిలో అలనాడు శ్రీరాముడే పాలిస్తునట్లుంది. రోజా ఒక మంచి నటి. ఒకవేళ బాబుగారు ఆదేశిస్తే వచ్చే ఎన్నికలలో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గం నుంచి ఆమెపై పోటీ చేయడానికి నేను సిద్దం. చంద్రబాబు నాయుడు నాకు ఎటువంటి బాధ్యత అప్పగించినా చేయడానికి నేను సిద్దంగా ఉన్నాను,” అని అన్నారు.
ఆమె ఇంకా పార్టీలో చేరక మునుపే వచ్చే ఎన్నికలలో నగరి నుంచి రోజాపై పోటీ చేస్తానని చెప్పడం ఆమె రాజకీయ అపరిపక్వతకు మొదటి నిదర్శనంగా కనిపిస్తోంది. ఆమె ఆవిధంగా చెప్పడం గమనిస్తే, వైకాపా ఎమ్మెల్యే రోజాను ఎదుర్కోవడం కోసమే తెదేపా ఆమెనురంగంలోకి దింపుతున్నట్లు చాటి చెప్పినట్లయింది. ఈవిధంగా ముందే పార్టీ వ్యూహాన్ని చాటి చెప్పడం మరో పొరపాటు.
అయితే అపార రాజకీయానుభవం, వర్తమాన రాజకీయ పరిస్థితుల పట్ల మంచి అవగాహన, ఎటువంటి సమస్యపైనైనా అనర్ఘళంగా సాధికారికతతో అచ్చమైన తేట తెలుగులో అందరినీ ఆకట్టుకొనే విధంగా మాట్లాడగల నేర్పు ఉన్న రోజాను కేరళకు చెందిన వాణీ విశ్వనాథ్ ఎదుర్కోగలదని ఆశించలేము. కనీసం ఆమె తెలుగు సినిమాలలో చేస్తున్నా ఆమె స్టార్ డం తేదేపాకు ఏమైనా ఉపయోగపడేది. కానీ అదికూడా లేని ఆమెను పార్టీలోకి ఎందుకు ఆహ్వానించాలనుకొంటున్నారో, రోజాను కట్టడి చేయడానికి ఆమె తగిన వ్యక్తి అని చనద్రబాబు ఎందుకు భావిస్తున్నారో తెలియదు.
ఆమె కంటే పార్టీలో తీవ్ర నిరాదరణకు గురవుతున్న అలనాటి నటి కవిత, నన్నపనేని రాజకుమారి వంటివారి సేవలను ఉపయోగించుకొంటే ఎక్కువ ప్రయోజనం ఉండవచ్చు. వారిరువురూ కూడా రోజాకు అన్ని విధాల సమఉజ్జీలే కనుక వారికి అవకాశం కల్పిస్తే ఇన్నాళ్ళకు తమను గుర్తించినందుకు వారు కూడా చాలా సంతోషిస్తారు..పార్టీ కోసం ఇంకా కష్టపడి పనిచేస్తారు కదా!