భారతదేశంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు ఈరోజు (గురువారం) శంఖుస్థాపన జరుగబోతోంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధానమంత్రి షింజో అబే కలిసి అహ్మదాబాద్ లో శంఖుస్థాపన చేస్తారు. నేటి నుంచి సరిగ్గా ఐదేళ్ళలో అంటే 2022 సం.లో ఈ బుల్లెట్ ట్రైన్ రెండు నగరాల మద్య దూసుకుపోవడం మొదలుపెడుతుంది. ఈ బుల్లెట్ ట్రైన్ గురించి చెప్పుకోవాలంటే చాలా విశేషాలే ఉన్నాయి.
1. దీనిని జపాన్ సంస్థలు నిర్మించబోతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. దానిలో సుమారు 80,000 కోట్లు జపాన్ ప్రభుత్వం 0.1 శాతం నామమాత్రపు వడ్డీతో అప్పుగా అందిస్తుంది. దానిని 50 ఏళ్ళలో తిరిగి చెల్లించవలసి ఉంటుంది.
2. ముంబై-అహ్మదాబాద్ మద్య దూరం 508 కిమీ. అత్యంత వేగంగా ప్రయాణించే మన ఎక్స్ ప్రెస్ ట్రైన్స్ కు ఆ దూరాన్ని అధిగమించడానికి సుమారు 7-8 గంటలు పైనే పడుతుంది. కానీ గంటకు సుమారు 250-320 వేగంతో ప్రయాణించే ఈ బుల్లెట్ ట్రైన్ కేవలం రెండున్నర గంటలలోనే చేరుకొంటుంది. కనుక దీనిని రోజుకు 35 ట్రిప్స్ వరకు తిప్పాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. భవిష్యత్ లో దీనికి ఉన్న డిమాండ్ ను బట్టి అవసరమైతే రోజుకు 70 ట్రిప్పులు తిప్పుకొనే విధంగా ఈ ప్రాజెక్టును నిర్మించబోతున్నారు.
3. సాధారణ ఎక్స్ ప్రెస్ ట్రైన్స్ లో ఒక బోగీకి 72 మంది ప్రయాణికుల చొప్పున సుమారు 12 బోగీలలో 864 మంది ప్రయాణిస్తుంటే, ఈ బుల్లెట్ ట్రైన్ లో 750 మంది ప్రయాణించగలరు.
4. 508 కిమీ పొడవుండే దీని మార్గంలో దాదాపు 92 శాతం దీని కోసమే ప్రత్యేకంగా ఎలివేటడ్ రూట్ నిర్మించబోతున్నారు. అది సుమారు 467.36కిమీ పొడవు ఉంటుంది.
5. మిగిలిన 8 శాతంలోనే అసలైన వింతలు, విడ్డూరాలు ఉంటాయి. దానిలో 6 శాతం సొరంగ మార్గం ఉంటుంది. దాని పొడవు సుమారు 21 కిమీ ఉంటుంది. ఇదే మన దేశంలో కెల్లా అతిపొడవైన రైల్వేసొరంగ మార్గం కాబోతోంది.
6. ఈ 21 కిమీ సొరంగ మార్గంలో మళ్ళీ 7 కిమీ సముద్ర గర్భంలో నిర్మించబడుతుంది. అంటే బుల్లెట్ ట్రైన్ వేగమే ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందనుకొంటే, మళ్ళీ దానిలో కూర్చొని సముద్రగర్భంలో సొరంగం గుండా ప్రయాణించడం మరో థ్రిల్లింగ్ అనుభూతిని కలిగిస్తుందన్న మాట. మిగిలిన 2 శాతంలో సుమారు 13 కిమీ హైవేరోడ్డుకు ఆనుకొని ప్రత్యేకంగా నిర్మింపబడుతుంది.
7. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రయాణించే మార్గంలో మొత్తం 12 రైల్వే స్టేషన్లు ఉంటాయి.
8. ఈ ప్రాజెక్టు 351 కిమీ గుజరాత్, 156 కిమీ మహారాష్ట్ర గుండా సాగుతుంది.
9. ఈ బుల్లెట్ ట్రైన్ ను 2022 ఆగస్ట్ 15తేదీన నడిపించాలని ఇప్పుడే ముహూర్తం కూడా ఖరారు చేశామని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఎందుకంటే ఆ రోజుకు మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తవుతుంది కనుక.
భారతీయుల కలలు సాకారం చేస్తున్నందుకు థాంక్స్ మోడీజీ..థాంక్యూ జపాన్!