కాంగ్రెస్ నేతలు శుక్రవారం నుంచి సిరిసిల్లలో రిలే నిరాహార దీక్షలు చేయబోతున్నారు. నెలరోజుల పాటు సాగే ఈ దీక్షలలో రోజుకొక సీనియర్ నేత పాల్గొంటారని పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి చెప్పారు.
నేరెళ్ళ ఘటనలో బాధితులకు న్యాయం చేసి దోషులందరినీ శిక్షించాలని కోరుతూ ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. నేరెళ్ళ ఘటనలో నేటికీ భాదితులకు తగిన వైద్యం అందించడానికి తెరాస సర్కార్ ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించారు. పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడిన వారినందరినీ ఆర్ధికంగా ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు.
నేరెళ్ళ పరిసర గ్రామాలలో ఇసుక మాఫియా చెలరేగిపోతోందని, ఇసుక లారీల క్రింద పడి అనేకమంది చనిపోతున్నారని అయినా ప్రభుత్వం ఇసుక మాఫియాను నియంత్రించడం లేదు...బాధితులకు న్యాయం చేయడం లేదని విమర్శించారు. ఇసుక లారీల క్రింద పడి చనిపోయిన వారి కుటుంబాలకు కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. భాదితులు అందరికీ న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగిస్తామని ఉత్తం కుమార్ రెడ్డి తెలిపారు. మొదటిరోజున సీనియర్ నేత వి. హనుమంతరావు పాల్గొంటారు.