రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్ధ పార్టీలను దెబ్బ తీయడానికి అనేక ఉపాయాలు అమలుచేస్తుంటాయి. కొన్నిసార్లు అవి అద్భుతమైన ఫలితాలు ఇస్తే కొన్నిసార్లు అవే మెడకు చుట్టుకొంటాయి. అటువంటి తాజా ఉదాహరణే ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి కేసు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెరాసను దెబ్బ తీసేందుకు తెరాస సర్కార్ నిర్ణయంపై కోర్టులో ఒక కేసు వేశారు. తెరాస సర్కార్ తన ఇష్టం వచ్చినట్లు సలహాదారులను నియమించుకొంటూ వారికి క్యాబినెట్ హోదా కట్టబెడుతూ పార్టీలో నేతలకు రాజకీయ ఉద్యోగాలు కల్పిస్తోందని, అది రాజ్యాంగం ప్రకారం చెల్లదని వాదిస్తూ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీలో నుంచి తెరాసలోకి మారారు. ఇప్పుడు తెరాస అస్మదీయులు కనుక ఆయన ఆ కేసు గురించి మరిచిపోయారు కానీ కోర్టు మాత్రం మరిచిపోలేదు. దానికిచ్చిన వాయిదా తేదీ ప్రకారం మంగళవారం ఆ కేసు విచారణను చేపట్టింది.
గుత్తా సుఖేందర్ రెడ్డి స్వయంగా ఆ కేసు వేసినప్పటికీ ఇప్పుడు తెరాసలో ఉన్నారు కనుక ఆ కేసును కొనసాగించలేరు. కనుక దానిని ఉపసంహరించుకోవడానికి తన లాయర్ ద్వారా న్యాయస్థానం అనుమతి కోరారు. దానికి ఎవరూ ఊహించలేని విధంగా న్యాయస్థానం స్పందించడం విశేషం.
“మీ రాజకీయాలకు న్యాయస్థానాన్ని వేదికగా వాడుకొంటారా? మీరు మీ అభిప్రాయలు మార్చుకొంటే న్యాయస్థానం కూడా తన అభిప్రాయలు మార్చుకోనవసరం లేదు. ఈ కేసుపై తప్పనిసరిగా విచారణ కొనసాగిస్తాము. దీనిలో మీ క్లైంట్ చెప్పుకోవలసినది ఏమైనా ఉంటే చెప్పుకోవచ్చు,” అని తేల్చి చెప్పింది.
గుత్తా సుఖేందర్ రెడ్డి ఆనాడు తాను తెరాస సర్కార్ కు వ్యతిరేకంగా వేసిన ఈ కేసుకు ఇప్పుడు ఆయన దూరంగా ఉన్నప్పటికీ, న్యాయస్థానం దానిపై విచారణ కొనసాగించి ప్రభుత్వ సలహాదారుల నియామకాలు చెల్లవని తీర్పు చెప్పినట్లయితే అందుకు అందరూ ఆయననే నిందిస్తారు. అందుకు రాజకీయంగా మూల్యం చెల్లించవలసి వచ్చినా ఆశ్చర్యం లేదు. గుత్తా సుఖేందర్ రెడ్డి పరిస్థితి ముందు చూస్తే నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు మారిందిప్పుడు.