చెన్నైలో నేడు అధికార అన్నాడిఎంకె పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి వికె శశికళను తొలగిస్తూ మంత్రి ఆర్.బి.ఉదయ్ కుమార్ ప్రవేశపెట్టిన ఒక తీర్మానాన్ని సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. దీనితో ఆమెకు పార్టీతో సంబంధం తెగిపోయాయి.
ఈ తీర్మానంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చనిపోయిన అమ్మ (జయలలిత) శాశ్విత పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటారనే ప్రతిపాదనకు అందరూ ఆమోదముద్ర వేయడం! కనుక ఆమె స్థానంలో మరెవరూ ఆ పదవిని చేపట్టకుండా ఆ పదవిని, దానితోబాటు తాత్కాలిక ప్రధానకార్యదర్శి పదవిని కూడా రద్దు చేస్తున్నట్లు తీర్మానంలో ప్రకటించారు.
ప్రధాన కార్యదర్శి పదవికి బదులుగా పార్టీ సమన్వయ కమిటీ అధ్యక్ష పదవిని సృష్టించారు. దాని అధ్యక్షుడుగా పన్నీర్ సెల్వం, ఉపాధ్యక్షుడుగా ముఖ్యమంత్రి పళనిస్వామి వ్యవహరిస్తారని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ పదవుల ద్వారా పార్టీ వ్యవహారాలపై వారిరువురికీ సర్వాధికారాలు సంక్రమిస్తాయి.
పార్టీలో వివిధ పదవులలో అమ్మ చేత నియమించినవారు యధాతధంగా ఆ పదవులలో కొనసాగుతారని ఈ తీర్మానంలో పేర్కొన్నారు. కొంతమంది నేతలను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు శశికళ మేనల్లుడు దినకరన్ చేసిన ప్రకటనలతో అన్నాడిఎంకె పార్టీకి ఎటువంటి సంబంధం లేదని వాటిని పార్టీలో ఎవరూ పట్టించుకోనవసరం లేదని తీర్మానంలో పేర్కొన్నారు.
పార్టీ నుంచి శాస్త్రప్రకారం శశికళకు ఉద్వాసన పలకడం అయిపోయింది కనుక ఇప్పుడు పళనిస్వామి ప్రభుత్వం శాసనసభలో తన బలం నిరూపించుకోవలసి ఉంటుంది. ఆ ఒక్క గండం గట్టెక్కినట్లయితే మళ్ళీ ఎన్నికల వరకు అన్నాడిఎంకెలో సుస్థిరత ఏర్పడినట్లే భావించవచ్చు.
దినకరన్ క్యాంప్ లో ఉన్న 19 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకొన్నారు కనుక తక్షణమే శాసనసభలో బలపరీక్ష నిర్వహించాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిఎంకె పార్టీ నేతలు గవర్నర్ విద్యాసాగర్ రావుపై ఒత్తిడి తెస్తున్నారు. ఒకవేళ పళనిస్వామి ప్రభుత్వాన్ని బలపరీక్షకు గవర్నర్ ఆదేశించకుండా ఇంకా తాత్సారం చేసినట్లయితే హైకోర్టులో పిటిషన్ వేయాలని డిఎంకె ఆలోచిస్తోంది.