రోజూ నీళ్ళు ఇవ్వగలిగితేనే భగీరథ షురూ

రాష్ట్రంలో ప్రతీ ఇంటికి మంచి నీళ్ళను అందించడానికి తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పధకం పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సంబంధిత అధికారులతో ప్రగతి భవన్ లో సమీక్షాసమావేశం నిర్వహించారు. దానిలో ఆయన అధికారులకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. 

“ఇప్పుడు త్రాగునీటి సరఫరాకే తొలి ప్రాధాన్యతక్రమంలో చేర్చాము. మిషన్ భగీరథ పధకం ద్వారా ఈ ఏడాది చివరిలోగా అన్ని గ్రామాలలో ఇంటింటికీ నీళ్ళు అందించాలనేదే మా లక్ష్యం. కనుక మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలి. రాష్ట్రంలో గుర్తించిన 30 ప్రధాన నీటివనరుల నుంచే ఇంటింటికీ నిరంతరాయంగా నీళ్ళు అందించబోతున్నాము కనుక వాటి నుంచి ఏడాది పొడవునా ప్రతీరోజు నీళ్ళు సరఫరా చేయడానికి అవసరమైన నీళ్ళ కంటే మరో 25 శాతం అదనంగా వాటిలో నీళ్ళు నిలువ ఉండేలా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పధకం ప్రారంభం అయిన రోజు నుంచి మళ్ళీ ఎన్నడూ నీళ్ళ సరఫరా ఆగకుండా చూసుకోవలసిన భాద్యత అధికారులదే. కనుక నిరంతర పర్యవేక్షణ, ముందస్తు ప్లానింగ్ తప్పనిసరి. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టుల నుంచి 10 శాతం నీటిని మిషన్ భగీరథ పధకానికి కేటాయించబోతున్నాము. కనుక వాటి  నుండి నీటి సరఫరా మొదలయ్యే వరకు గుర్తించిన 30 నీటి వనరులలో తప్పనిసరిగా తగినంత నీటి నిలువలు ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.,” అని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు మార్గదర్శనం చేశారు.  

ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పి సింగ్, మిషన్ భగీరథ ఈ.ఎన్.సి. సురేందర్ రెడ్డి, సి.ఈ.ఓ. జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.