ఏమీ తెలియదు..కానీ ఏదో రాసేస్తుంటారు!

మన రాజకీయ నాయకులకు అందరూ లోకువే. ఐఏఎస్, ఐపిఎస్ అధికారులంటే ఖాతరు ఉండదు. ప్రభుత్వాధికారులను బహిరంగంగా చెంప చెళ్ళుమనిపించగలరు. ఇక ప్రజలంటే ఓట్లు వేసే యంత్రాలుగానే భావిస్తుంటారు. ఎన్నికలకు ముందు ప్రజలకు దండలు పెట్టి, అధికారంలోకి రాగానే బ్లాక్ క్యాట్ కమెండోలతో వారిని తమ దరిదాపులలోకి రాకుండా తరిమికొడుతుంటారు. చివరకు తమ రాజకీయ కార్యకలాపాల గురించి నిత్యం వార్తలు వ్రాసే జర్నలిస్టులన్నా వారికి ఎంత చులకనభావం ఉంటుందో అర్ధం చేసుకోవడానికి కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే మాటలు వింటే అర్ధం అవుతుంది. 

ఆయన నిన్న కర్నాటకలో పర్యటిస్తున్నప్పుడు మీడియాతో మాట్లాడుతూ, “ఎవరిని ఏమి ప్రశ్నించాలో..ఏమి రాయాలో తెలియని వాళ్ళు మన జర్నలిస్టులు. అసలు జర్నలిజం గురించి ఏమాత్రం అవగాహన లేనివారందరూ జర్నలిస్టులు అయిపోతున్నారు. మన మీడియాలో అందరూ హడావుడి చేసే మనుషులే ఉన్నారు తప్ప సరైన పరిశోధన చేసి వార్తలు వ్రాసేవారు చాలా తక్కువమంది ఉన్నారు” అని అన్నారు. 

తమ గురించి చేసిన ఈ వ్యాఖ్యలపై జర్నలిస్టులు నిరసనలు తెలియజేయడంతో మంత్రిగారు మాటమార్చి “ఇక్కడి జర్నలిస్టులు బాగానే పనిచేస్తున్నారు. నేను వేరే వాళ్ళ గురించి అన్నాను,” అని సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నించారు. కానీ దేశవ్యాప్తంగా జర్నలిస్ట్ సంఘాలు ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి.