భారతీయ పౌరసత్వం కోల్పోయిన తెరాస వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో తాత్కాలికంగా ఊరట లభించింది. తన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆయన వేసిన పిటిషన్ పై ఈరోజు విచారణ జరిపిన హైకోర్టు ఆ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేస్తూ స్టే విధించింది.
ఈ కేసులో తన వాదనలను వినిపించేందుకు హోంశాఖ తనకు అసలు అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేసిందని, అవి సహజ న్యాయానికి విరుద్దమైనవని కనుక ఆ ఉత్తర్వులని నిలిపివేయాలని తన పిటిషన్ లో కోరారు.
తాను భారతదేశంలోనే జన్మించి ఇక్కడే పెరిగిపెద్దవాడినయ్యానని, కానీ ఉన్నత విద్యల కోసం జర్మనీ వెళ్ళినప్పుడు అక్కడ ఉద్యోగం కోసం జర్మనీ పౌరసత్వం స్వీకరించవలసి వచ్చిందని తన పిటిషను లో పేర్కొన్నారు. నేను భారత్ తిరిగివచ్చేసిన తరువాత మళ్ళీ భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోగా 2009, ఫిబ్రవరి 3న కేంద్రహోంశాఖ తనకు పౌరసత్వం మజూరు చేసిందని తన పిటిషనులో తెలిపారు. సాధారణంగా దేశద్రోహం కేసులలోనే పౌరసత్వం రద్దు చేయబడుతుందని, కానీ తాను కరీంనగర్ జిల్లాలో అనేక అభివృద్ధి పనులు చేపట్టానని తెలిపారు. గత ఎన్నికలలో భాజపా అభ్యర్ధిగా పోటీ చేసిన ఆది శ్రీనివాస్ తన చేతిలో ఓడిపోయిన కారణంగానే, తనపై ద్వేషం పెంచుకొని ఈ కేసు వేశారని, కానీ రాజ్యంగం ప్రకారం పౌరసత్వం మంజూరు అయిన 30 రోజుల గడువులోగా తనపై కేసు దాఖలు చేయలేదని, కానీ కేంద్రప్రభుత్వం దీనిని పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని తన పౌరసత్వం రద్దు చేసిందని, ఇది అన్యాయమని రమేష్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషనుపై స్టే విదించిన హైకోర్టు, హోంశాఖలో సంబధిత అధికారులను కౌంటర్ దాఖలు చేయాలని కోరింది.