సోదాలు ముగిసాయి..హైకోర్టు ఏమి చెపుతుందో?

హర్యానాలో సిర్సా పట్టణంలోని డేరా సచ్చా  సౌధా ఆశ్రమంలో గత మూడు, నాలుగు రోజులుగా జరుగుతున్న పోలీసుల సోదాలు ఆదివారం పూర్తవడంతో, నేటి నుంచి సిర్సాకు రైళ్ళు, బస్సుల రాకపోకలు మొదలుకానున్నాయి. అలాగే గత నాలుగు రోజులుగా నిలిపివేయబడిన ఇంటర్నెట్ సేవలు కూడా నేటి నుంచి మళ్ళీ ప్రారంభంకానున్నాయి. గుర్మీత్ రాం రహీం సింగ్ దత్త పుత్రిక హనీ ప్రీత్ సింగ్ పోలీసులకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం, పోలీసుల సోదాలలో ఆశ్రమంలో జరుగుతున్న అవకతవకలన్నీ వెలుగుచూడటంతో ఇదివరకులాగ డేరా అనుచరులు రోడ్లపైకి వచ్చి విద్వంసం సృష్టించే సాహసం చేయడం లేదు. 

సచ్చా సౌధాలో కనుగొన్న వివరాలను పోలీసులు నివేదిక రూపంలో పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టుకు సమర్పిస్తారు. దానితో బాటు సచ్చా సౌధాలో సోదాలు నిర్వహిస్తున్నప్పుడు తీసిన వీడియో రికార్డింగ్ ఆధారాలను కూడా హైకోర్టుకు సమర్పిస్తారు.

సచ్చా సౌధా ఆశ్రమం అధినేత గుర్మీత్ రాం రహీం సింగ్ ఇద్దరు మహిళా భక్తులపై అత్యాచారం చేసినట్లు రుజువు అవడంతో 20 ఏళ్ళు జైలు శిక్ష పడింది. పోలీసుల సోదాలలో ఆశ్రమంలో అనేకమంది హత్య చేయబడినట్లు, మహిళలపై అత్యాచారాలు జరిగినట్లు, అనుమతి లేకుండా అవయవ మార్పిడి ఆపరేషన్లు చేసినట్లు, ప్లాస్టిక్ కరెన్సీతో సమాంతర ఆర్ధికవ్యవస్థను నడిపించిన్నట్లు బయటపడింది. కనుక తీవ్రమైన ఈ నేరాలన్నిటినీ హైకోర్టు పరిగణనలోకి తీసుకొని గుర్మీత్ రాం రహీం సింగ్ కు ఇంకా కటినమైన శిక్ష విధించినా ఆశ్చర్యం లేదు.