తెలంగాణా రాష్ట్రం ఏర్పడి మూడున్నరేళ్ళు నిండుతున్నా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు నేటికీ కొనసాగుతూనే ఉండటం చాలా బాధాకరం. పంటలు, బోరుబావుల కోసం చేసిన అప్పులు తీర్చలేక, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడం వారి ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు. నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకొంటూనే ఉన్నారు. అయినా మంత్రి హరీష్ రావు, కర్నే ప్రభాకర్, బాల్కా సుమన్ వంటి తెరాస నేతలు తమ పాలనలో రైతులందరూ చాలా సుఖ సంతోషాలతోనే ఉన్నారని, బల్లగుద్ది వాదిస్తుంటారు.
మంత్రి హరీష్ రావు నిన్న తెలంగాణా భవన్ లో మాట్లాడుతూ “మా ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పధకాలు కాంగ్రెస్ పార్టీ పాలిట శాపంగా మారబోతున్నాయి. అందుకే వారు నిరాశానిస్పృహలతో కృంగిపోతూ మా ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు తాము బాధలో ఉన్నప్పుడు రాష్ట్రంలో రైతులు సుఖసంతోషాలతో ఉండటం చూడలేకపోతున్నారు. రైతులు కూడా ఎప్పుడూ బాధలు, కష్టాలు అనుభవిస్తూనే ఉండాలని వారు కోరుకొంటున్నారు. వారి ఈ రాక్షసతత్వం కారణంగానే రైతులలో ఆత్మన్యూనత పెరుగుతోంది. కానీ మా ప్రభుత్వం రైతులను అన్నివిధాలుగా అండగా నిలబడుతుంది,” అని అన్నారు.
మంత్రి హరీష్ రావు ఈ మాటలు చెపుతున్న సమయంలోనే మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంకటగిరిలో మల్లేశం (35), ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి మండలంలోని మూటాపురంలో వెంకటేశ్వర్లు (34) అనే రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. ఇద్దరూ పంటల కోసం చేసిన అప్పులు తీర్చలేక, వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్ళు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొన్నారు.
నిజమే! రాష్ట్రంలో సాగునీరు, వ్యవసాయాభివృద్ధి చేసి తద్వారా రైతులను ఆదుకోవడానికి తెరాస సర్కార్ చాలా చేస్తోంది. వాటి ఫలితాలు కనబడటానికి ఇంకా మరికొన్నేళ్ళు పట్టవచ్చు. కానీ ఈలోగా రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నప్పుడు కూడా రాష్ట్రంలో ‘ఆల్ ఈజ్ వెల్’ అని కోరస్ తెరాస నేతలు పాడుకొంటూ రైతులు సుఖసంతోషాలతో ఉన్నారని గొప్పగా చెప్పుకోవడమే విడ్డూరం.